Saturday, February 19, 2011

గలగల పారే గోదావరి

గలగల పారే గోదావరీ
జలజల సాగే కవితాఝరీ
హృదయంలో ఉప్పొంగే కావ్యలహరి
జీవన రాగంలా ప్రవహించే రసమాధురి
మా కంటి వెలుగు గోదావరి
మా ఇంటి వేల్పు గోదావరి
మా బ్రతుకు తెరువు గోదావరీ…
మా కలత తీర్చు గోదావరీ… - ”గలగల పారే”

త్రయంబకాన బొట్టులా పుట్టి
మహారాష్ట్రలో పరుగులు పెట్టి
అఖండ గోదావరిగ అవతరించి
గౌతమిగా దక్షిణ గంగగా
మనతోటల పాలిట జలనిధిగా
ప్రవహించే గొదావరి
మనలను కరుణించే గొదావరి
కరువు కాటకం కబళించే గోదావరీ…
సిరిసంపదలు కలిగించే గోదావరీ… - “గలగల పారే”

బాసరలో శారదతో ముచ్చటించి
మంజీర నాదంలో తన్మయించి
ప్రాణహిత రాగంతో
ఇంద్రావతి వేగంతో
శబరి సీలేరుల ప్రాభవంతో
తూరుపు కనుమల పాపిట తీసి
రాజమహేంద్రిలో రాజసమొలికి
గౌతమీ వశిష్టలుగా ద్వయమెత్తి
సాగరాన సంగమించు గోదావరీ…
ఉత్తుంగ తరంగ గంగ గోదావరీ … - “గలగల పారే”

Thursday, February 10, 2011

వెన్నెలమ్మ రావే

వెన్నెలమ్మ రావే చల్లనమ్మ రావే
మబ్బెక్కి రావే మంచి కబురు తేవే

చందమామ ఇంటిలోని
వెలుగులన్ని పట్టి తేవే
మాముద్దుల పాపకనులనింపి పోవే

ఆకసాన విహరించే
చుక్కలన్ని చుట్టి తేవే
మాముద్దుల పాపజడనగుచ్చి పోవే

మా పాపాయి బువ్వ తిని
నీతోటి ఆడెనట
పరుగుపరుగునా నువ్వు వచ్చిపోవే

వెన్నెలమ్మ రావే చల్లనమ్మ రావే
మబ్బెక్కి రావే మంచి కబురు తేవే

Monday, February 7, 2011

స్వరోపాసన

నా గానం సామవేద సారం
నా గీతం సప్తస్వర సంయోగం
నా ప్రాణం నందీమృదంగ నాదం
నా దేహం స్వరరాగతాళాల
మేలుకలయికల మధుర గాన గాంధర్వం //నా గానం//

ఎదలోతులలో కదిలే భావం
మోవి పలికించు మురళీ నాదం
కనుపాపలలో వెలిగే దీపం
మది వినిపించు మహతీ గానం
తనువులోని అణువణువు పాడే
వేదనాద స్వర సంప్రదాయం
ప్రకృతి లోని ప్రతి రేణువు తెలిపే
సప్తస్వర సంగీత సుధారసమాధుర్యం
నా జీవనాధార గానామృతం
సంగీత సాహిత్య కళారాధనం //నా గానం//

స్వర తంత్రులలో ఒలికే జీవం
శృతి లయలై నినదించగా
ఆలాపనలో సాగే రాగం
స్వరఝరులై ప్రవహించగా
స్వరమూ స్వరమూ స్వరజతులై
స్వరరాగ సంగతులై ప్రభవించగా
దశవిధ గమకాలు దశదిశల వ్యాపించగా
ఓంకారనాదాలు దిగంతాల ధ్వనియించగా
నా పంచప్రాణాల నిక్వాణ గీతం
సప్తస్వరోపాసనకే అంకితం //నా గానం//

Sunday, February 6, 2011

తొలివలపు

తొలిచూపులోనే నిను నేను వలచా
కడదాక నీతోనే అని నేను తలచా
నీ నీడ నేనై నీ తోడు రానా
నా శ్వాస నీవై నను చేరుకోవా --”తొలిచూపులోనే”

నిను చూసింది మొదలు
చెలరేగింది గుబులు
నీ సొగసు నాలో రేపింది అలలు
నీ వెంట సాగే ఆ పరిమళాలే
నను వెంటాడి నీవైపు లాగే
ఏ వైపు చూసినా నీ రూపమేగా
ఏ నోటవిన్నా నీమాటలేగా
కలయా నిజమా మన ప్రేమ జంట
వరమా కలవరమా మన వలపు పంట -- “తొలిచూపులోనే”

ఏ నాటి ఫలమో ఇది
నా జతన చేరింది
నా బ్రతుకులోన ఆశలు పూసింది
జఢమైన నా చిలిపి కోరికలే
ప్రేమజడివానలో తడిసి విరిసేనులే
నీ తోడులేక నేను సగమే కదా
నీ జంట చేరితే పరిపూర్ణమౌతానుగా
చెలివో నెచ్చెలివో నను వీడిపోకు
నీతోనె నా చెలిమి చితిచేరువరకు -- ”తొలిచూపులోనే”

Friday, February 4, 2011

అనుకోలేదే

అనుకోలేదే ఈ నిమిషం
ఎదలో మల్లెలు విరియుననీ
కలగనలేదే ఈ విషయం
బ్రతుకున తేనెలు కురుయుననీ - “అనుకోలేదే”

ఎడారిన నదులే పొంగుననీ
ఎండిన మానే చిగురించుననీ
మౌనమే మాటలాడుననీ
మూగవోయిన హ్రుదయవీణ
తిరిగి పాట పాడుననీ - “అనుకోలేదే”

కారుమబ్బులే కరుగుననీ
మంచుపొరలే తొలగుననీ
నుదిటి రాతలే మారుననీ
నడక మరచిన నాట్యమయూరి
తిరిగి ఆటలాడుననీ - “అనుకోలేదే”

శిశిరమే వికసించుననీ
గరళమే బ్రతికించుననీ
కఠినశిలలే కరుణించుననీ
చీకటి కమ్మిన చందమామ
తిరిగి వెన్నెల చిలుకుననీ - “అనుకోలేదే”

Tuesday, February 1, 2011

తెలుగమ్మాయి

సాకీ:
తెలుగుతనం ఉట్టిపడే బుట్ట బొమ్మలా
బాపూబొమ్మ ఉలికిపడే ముద్దుగుమ్మలా
అమరావతి శిల్పంలా అన్నమయ్య కల్పనలా
క్రిష్ణవేణి తరగలా గోదావరి నురగలా

పల్లవి:
ఎవరో ఎవరో నను పిలిచారూ
ఎదలో సుధలే కురిపించారూ
ఎవరో ఎవరో నను తలచారూ
మదిలో గుబులే కలిగించారూ ----- ”ఎవరో”

చరణం 1:
నుదుటిన మెరిసే కుంకుమ తిలకంలా
కనులకు దిద్దిన నల్లని కాటుకలా
అరచేతిన పండిన ఎర్రని గోరింటలా
పాదాలకు రాసిన పచ్చ ని పారాణిలా
కూచిపూడి భంగిమలా
క్షేత్రయ్య భావనలా
కొండపల్లి బొమ్మలా
కోనసీమ కొబ్బరి రెమ్మలా
ముంగిట ముచ్చటగా తీర్చిన
రంగవల్లికలా ----- ” ఎవరో”

చరణం2:
పెరటిలో వెలసిన తులసీ కోటలా
ఇంటిముందు విరిసిన గులాబీ తోటలా
తలలూపుతు పలకరించు పచ్చని పైరులా
గలగల పారుతున్న తెల్లని సెలయేరులా
దీపావళి వెలుగులా
సంక్రాంతి సందడిలా
రామదాసు కీర్తనలా
ఘంటసాల మధుర గాత్రములా
అందరినీ అలరించే స్వాతి
సపరివార పత్రికలా ----- ”ఎవరో”