Tuesday, April 12, 2011

రామా నిన్నే నమ్మితిమయ్యా


శ్రీ రఘు రామా సీతారామా
నీ నామ స్మరణే మధురమయా
నీ పాద సేవే మా సౌభాగ్యమయా//శ్రీ రఘు రామా//

కౌసల్య తనయా కోదండ రామా
కైవల్య పద దాత కౌస్తుభ రామా
నీ కర కమలములే...
దీవెనలొసగే దివ్యశయములయా
నీ శుభ చరణములే...
ముక్తిని చూపే పరమ పాదములయా
నీ నామ కీర్తనలే...
భవ సాగరమును దాటించు సుమ తరణములయా//శ్రీ రఘు రామా//

నిరతము నిన్నే కొలిచెదమయ్యా
మదిలో నిన్నే నిలిపెదమయ్యా
నీ చిరునవ్వే మాకు చాలునయ
నీ కరుణ మాపై కురిపించవయా
నీ దాసుల మొర ఆలకించవయ
నీ పాదాల చెంత చేరనీయవయా
నీ కీర్తి వేనోళ్ల పాడెదమయ్య
మా హృదయములో నిత్యము నిదురించవయా//శ్రీ రఘు రామా//

Wednesday, April 6, 2011

జయమ్ము నిశ్చయమ్మురా..

ఓటమితో ధైర్యము వీడకు
నిరాశతో దిగాలు పడకు
కన్నీళ్లతో కాలం గడపకురా...
నిన్న నీది కాదనుకుంటే నేడు నీదే ఔనురా
నేడు కలసి రాకుంటే రేపు ఉండనే ఉందిరా
నమ్మకమే శ్రీరామ రక్షరా
ధైర్యంగా ముందుకు పోతే
గెలుపే నీ పక్షమురా //ఓటమితో//

తప్పటడుగులు వేస్తూనే
నడక నువ్వు నేర్చుకోరా
పెను తుఫానులెదురైనా
నీ గమ్యం చేరుకోరా
కన్నీళ్లెంతగ కార్చినా
కడుపు నీది నిండదురా
ఎదురు దెబ్బలే నీకు
బ్రతుకు నేర్పు పాఠమురా
రాళ్ళువిసిరే వాళ్ళకు
అందనత ఎదగాలిరా
వేలెత్తి చూపినవాళ్ళే
జేజేలు పలకాలిరా //ఓటమితో//

గ్రహణం పట్టిన సూర్యుడు
తిరిగి వెలుగు చిమ్మునురా
మబ్బు పట్టిన చంద్రుడు
మరల వెన్నెల కురియునురా
తెలియక పొరపాటు జరిగితే
జీవితాంతము వగచకురా
తప్పులు సరిదిద్దుకుంటూ
ముందుకు సాగి పోవాలిరా
చిమ్మచీకటి చీల్చుకుంటూ
వెలుగురేఖలు వచ్చునురా
కల్లోలమైన సముద్రమే
గజ ఈతను నేర్పునురా //ఓటమితో//