Monday, June 20, 2011

ఎవరమ్మా నీవెవరమ్మా


బాపూ బొమ్మవా
శ్రీ శ్రీ కవితవా
పరిమళాలు వెదజల్లే
అన్నమయ్య కీర్తనవా
నా మనసే దోచుకున్న
కృష్ణశాస్త్రి గీతికవా
ఎవరమ్మా నీవెవరమ్మా...//బాపూ బొమ్మవా//

మల్లెల తోటలో విరబూసిన
సన్నజాజి తీగవా
ఊరు చివర కొలనులో అరవిచ్చిన
ఎర్రకలువ పూవువా
ఆమని కోయిల తీయగ పాడే
మధురమైన పాటవా..
గలగల పారే సెలయేటి సవ్వడివా..
ఎవరమ్మా నీవెవరమ్మా..//బాపూ బొమ్మవా//

సాయంత్రం వేళలో మెల్లగ వీచే
చల్లని పిల్ల గాలివా
వేసవివేడిలో హాయిగ కురిసే
తొలకరి చిరుజల్లువా
హేమంత ఋతువులో వేడిని రగిలించే
నులివెచ్చని కౌగిలివా..
రవివర్మ చిత్రించిన రంగుల కలవా..
ఎవరమ్మా నీవెవరమ్మా.. //బాపూ బొమ్మవా//

Friday, June 17, 2011

వర్షంతో స్నేహం


వానా వానా వానా
నా చెంప నిమిరి పోవమ్మా
చిననాటి నేస్తం లేకున్నా
నీ తోడే నాకు చాలమ్మా
నేనేడ్చిన ప్రతిసారీ
నువ్వు నన్ను చేరాలమ్మా
నా కన్నీరెవరికి కనపడకుండా
తుడిచి వెళ్లి పోవాలమ్మా //వానా వానా//

దూరమైన చిననాటి స్నేహం
మళ్లీ చిగురించేనా
ఇన్నాళ్లకు కలిసిన నేస్తం
తిరిగి దూరమయ్యేనా
ఎలా మరచిపోనమ్మా మా నేస్తాన్నీ
ఎలా చంపుకోనమ్మా ఈ స్నేహాన్నీ
మా మథ్యన మిగిలిందొక
పెను అగాథమేనా..
విథి రాసిన రాతలో
మాదొక వింత కథయేనా.. //వానా వానా//

ఒక బండరాయిలా నేను
పైకి కనిపిస్తున్నా
లోలోన వర్షించే
కారు మబ్బులా ఉన్నా
తీరమెంత శాంతమైనా
కడలి అలలు దాగేనా
నాలో రేగే అలజడిని
ఈ అలలు మింగగలిగేనా
ఈ వర్షం వెలిసే లోగా
మనసారా ఏడవగలనా... //వానా వానా//