Monday, September 26, 2011

హేయ్‌ బ్యూటీ

(ఈ మధ్య వస్తున్న సినిమా పాటల ట్రెండుకనుగుణంగా ఒక చిన్న ప్రయత్నం చేశాను..ఈ కింది పాటలో..ఎలా ఉందో చెప్పండి)

హేయ్‌ బ్యూటీ...
జర ముడ్‌ కే దేఖో పీఛే
నా మాటే...
జర బోల్‌ నేదో తుంసే
నీ అందమే నను చుట్టేసిందే
అది బంధమై నను కట్టేసిందే
నిన్నిక వదలనే నన్నెంతగా తిట్టినా
తుంసే ప్యార్‌ హై సనం నీమీదొట్టుగా //హేయ్‌ బ్యూటీ...//

ఆగే ఆగే నువు పోతూ ఉంటే
పీఛే పీఛే నేవస్తూ ఉంటే
చూసేవాళ్లేమనుకుంటారే
నీ పరుగు ఆపి నాతో వస్తే
నాకున్నదంత నీకే ఇస్తానే
ఆవో సాథ్‌ సాథ్‌ జీయేంగే
సాథ్‌ మిల్‌ కే ఘూమేంగే
చచ్చే దాక చెయ్యి వదలనే
నువ్వొచ్చేదాకా పట్టు వీడనే //హేయ్‌ బ్యూటీ...//

ఇన్నాళ్లు తిరిగానే అవారాగా
నీ ప్రేమ లో పడిపోయానే దీవానాగా
నువు కాదంటే ఐపోతానే పాగల్‌ గానిగా
నీ అందానికే లేదే పోటీ
ఈ పోకిరిగానికి లేదే సాటి
మేరీ బాత్‌ సున్‌ లో పోరీ
తిరుగులేనిదే హం దోనోంకా జోడీ
ఇంకా ఎందుకే ఆ బింకం
వదిలిపెట్టవే నీ పంతం //హేయ్‌ బ్యూటీ...//

నిన్నే చూస్తున్నా(Revised)

పల్లవి:
నిన్నే చూస్తున్నా
నీవెంటే వస్తున్నా
నీ ఊహలలో...
నీ ఊపిరిలో...
పాగా వేస్తున్నా...
నిన్నే చూస్తున్నా...
నిన్నే చూస్తున్నా.....//నిన్నే చూస్తున్నా//

చరణం 1:
నాకిది కొత్తగా ఉన్నా
నీకది వింతగా తోస్తున్నా
నీతోనే నేననుకున్నా
నీతోనే నే కలగన్నా
ఎదలో వలపును రగిలించీ
ఏమీ పట్టనట్టు వెళుతున్నావు
నీకిది న్యాయమా..ప్రియతమా...//నిన్నే చూస్తున్నా//

చరణం 2:
నీ ప్రేమే నాదనుకున్నా
నా బ్రతుకే నీదనుకున్నా
నీ శ్వాసే నాప్రాణమనీ
నీ ధ్యాసే నా లోకమనీ
కలలెన్నో కన్నాను
కాలాన్నే మరచాను
నా దరి చేరవా.. ప్రియతమా...//నిన్నే చూస్తున్నా//

రంగుల కల

పల్లవి:
రంగుల కలలో..
ఊహల వలలో..
విహరించే చెలీ
ఆశల ఒడిలో..
వేదన జడిలో..
నిదురించే సఖీ
కనులు తెరచి ఇటు చూడొకసారి
నీ ఎదుట నిలిచింది నిజం విసిగి వేసారి //రంగుల కలలో//

చరణం 1:
ఆకాశమే అందుకోవాలని
తారలనే చేరుకోవాలని
వెన్నెలనే కోసుకోవాలని
ఆశపడిన ఓ చిలకమ్మా
నేలకు దిగి రావమ్మా
నిజమేదో తెలుసుకోవమ్మా... //రంగుల కలలో//

చరణం 2:
ఇంద్ర ధనసుపై నడవాలని
మేఘాలతో ఆడుకోవాలని
స్వర్గానికి వంతెన వేయాలని
కలలు కన్న ఓ చిట్టెమ్మా
నిదుర వీడి లేవమ్మా
చుట్టూ ఓసారి చూసుకోవమ్మా... //రంగుల కలలో//

Monday, September 19, 2011

సినిమా జీవితం

సినిమా సినిమా సినిమా
చూడర బాబూ సినిమా
సినిమా లేని జీవితం
బ్రతకడమే నిరర్థకం
నీలో ఉన్న బాధలన్నీ
ఒక సినిమా చూస్తే మటుమాయం //సినిమా సినిమా//

రోజంతా కష్టపడి
సాయంత్రం సినిమాకొస్తే
ఒంట్లోని నీరసమంతా
చిటికెలో అదృశ్యం
నిద్రలో నీ కలలన్నీ
కళ్లముందే సాక్షాత్కారం
సినిమా హాల్లో మూడుగంటలూ
నువ్వే హీరో రెచ్చిపో
కాసేపైనా ఊరటనిచ్చే
సినిమాయే నీ నేస్తమురా
చిరాకులన్నీ దూరం చేసే
మహామంత్రమే సినిమారా//సినిమా సినిమా//

నీ చుట్టూ జరిగేదే
సినిమా నీకు చూపిస్తుంది
సినిమాలో నువు చూసేదే
నీ చుట్టూ తిరుగుతు ఉంది
సినిమాయేరా జీవితం
మనలో కొందరికీ
సినిమాలు చూడందే
నిదుర రాదు ఎంతోమందికి
సినిమా హీరోలే వీళ్లకు
కనిపించే దైవాలూ
వారి కోసం ఏమైనా
చేస్తారులే అభిమానులు//సినిమా సినిమా//

Friday, September 16, 2011

నిన్నే చూస్తున్నా

పల్లవి:
నిన్నే చూస్తున్నా
నీవెంటే వస్తున్నా
నీ ఊహలలో...
నీ ఊపిరిలో...
పాగా వేస్తున్నా...
నిన్నే చూస్తున్నా..... //నిన్నే చూస్తున్నా//

చరణం 1:
నాకేదో కొత్తగా ఉన్నా
నీకేమీ తెలియనట్టున్నా
నీతోనే నేననుకున్నా
నీతోనే నే కలగన్నా
ఎదలో అగ్గి రాజేసి
ఏమీ ఎరగనట్టు వెళుతున్నావు
నీకిది న్యాయమా..ప్రియతమా...//నిన్నే చూస్తున్నా//

చరణం 2:
నీ ప్రేమే నాదనుకున్నా
బ్రతుకే నీకు దాసోహమన్నా
నీ శ్వాసే నాప్రాణమనుకున్నా
నీ ధ్యాసే నా లోకమనుకున్నా
పరువాన్నే ఉసిగొలిపావు
నా హృదయాన్నే తట్టి లేపావు
నా ఆవేదనా ..తీర్చవా..//నిన్నే చూస్తున్నా//

Wednesday, September 14, 2011

జోజో లాలీ..జోజో లాలీ..

పల్లవి:
జోజో లాలీ జోజో లాలీ
ఆదమరచీ నువు నిదురపోవాలీ
ఆ నిదురలో తీయనీ
కలలే....కనాలీ
జోజో లాలీ జోజో లాలీ //జోజో లాలీ//

చరణం 1:
నీ బోసినవ్వులే మాకు
మణులూ మాణిక్యాలు
నీ చిలిపి కేరింతలే మాకు
ఆ దేవుడిచ్చిన వరాలు
బుడి బుడి నీ నడకలే మాకు
హాయి గొలుపు వేడుకలు
రోజంతా ఆడి నీవు అలసిపోయావురా కన్నా
ఇకనైన నిదురించి నీ అలుపు తీర్చుకోర నాన్న
మా చిట్టి పాపా..మా గారాల పట్టీ//జోజో లాలీ//

చరణం 2:
ఏ జన్మ సుకృతమో
మా ఇంట వెలిశావు
ఏ నోముల ఫలమో
మా కంటి పాపవైనావు
సేదతీరా నిదురపో
నీ కలతలన్నీ మరచిపో
నీ రాకతో నిండెనమ్మ మా లోగిలిలో వెలుగులు
నీ నవ్వుతో పండెనమ్మ మేము కన్న కలలు
ఓ ముద్దుల తల్లీ..మా కల్పవల్లీ//జోజో లాలీ//

Monday, September 12, 2011

నిన్నా మొన్నా లేనిది ఏదో

నిన్నా మొన్నా లేనిది ఏదో
నేడే నాలో మొదలయ్యింది
పగలూ రాత్రీ తేడా తెలియక
నిన్నే కలవరిస్తోంది
అది ఏమిటో ప్రియా... తెలుపవా
నీమదిలో నన్నే ...నిలుపవా //నిన్నా మొన్నా//

నిను ఏ క్షణమైతే చూశానో
నన్ను నేనే మరిచానూ
నీ ఊహలలో తేలిపోతూ
నా ఉనికిని ఎపుడో వదిలేశాను
నన్ను నీలో చూసుకుంటూ
జీవితమంతా గడిపేస్తాను
నీతోనే పయనిస్తూ
వెయ్యేళ్లైనా బ్రతికేస్తాను//నిన్నా మొన్నా//

నీ చుట్టూ ఇంత జరిగినా
అసలేమీ పట్టదా నీకు
నను కట్టేసిన నీమనసునకు
వినిపించదా నా పిలుపు
ఇంత కఠినమా నీ హృదయం
ఉలుకూ పలుకు లేనే లేదు
ఒక్కసారి తొంగి చూడు
నీ ఎదలోనే ఒదిగున్నా నేను //నిన్నా మొన్నా//

Sunday, September 4, 2011

గురువే దైవం


సాకీ:
గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః
గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్‌ పరబ్రహ్మ
తస్మైశ్రీ గురవేనమః

పల్లవి:
నీ జ్ఞానానికి మూలం
నీ ధ్యానానికి మూలం
నీ మంత్రానికి మూలం
నీ ముక్తికి మార్గం గురువే కదా...
గురువంటే దైవం
గురువంటే విశ్వం
గురువంటే సమస్తం
ఆ గురువుకు చేయాలి
ప్రతి ఉదయం నమస్కారం... //నీ జ్ఞానానికి//

చరణం 1:
మాతృదేవోభవ...
పితృదేవోభవ...
ఆచార్య దేవోభవ...
గురువంటే నీ మాతాపితలతో సమానం
అందుకే సేవించాలి ఆయనను అనుదినం
నీకూ ఆ దేవునికి మథ్య ఉన్న
వారథియేరా గురువు
గురువు మాట వినకుంటే
లేదు నీకు బ్రతుకు తెరువు...
తల్లీ తండ్రీ గురువూ..
నీకు కనిపించే దైవాలు
వారిని పూజించిన చాలు
ఆదేవుని కరుణ నీపై వాలు... //నీ జ్ఞానానికి//

చరణం 2:
గురువంటే జ్ఞానం
గురువంటే యోగం
గురువంటే యజ్ఞం...
ఆ గురువు నీకు చూపించే మార్గము
ఇహపరాన దక్కించును సౌఖ్యము
మంచేదో చెడు ఏదో
నీకు తెలిపేది గురువూ..
మంచి మార్గాన
నిన్ను నడిపేది గురువూ..
నీకూ గురువుకు ఉన్న బంధము
అది ఒక అద్వితీయ అనుబంధము
ఆ అనుబంధానికి మించి లేదు
మరి ఏ పవిత్ర సంబంధము //నీ జ్ఞానానికి//

Thursday, September 1, 2011

సంగమం


సంగమం.. రాగాంగ సంయోగం
రాగానురాగాల సంధానం
ఇది నా హృదయము అర్పించు
సుమగాన సంకీర్తనం //సంగమం//

కన్నీటి కెరటాలు అలలైసాగగ
మంజీర నాదాలు ఝరులై పారగ
మదిలో దాగిన అక్షర మాలలు
వెల్లువలై పొంగిన వేళ
మూగబోయిన అందెల రవళులు
దిగంతాలను తాకిన వేళ
ప్రకృతిలోని ప్రతి పిలుపూ
ప్రణవ రాగమై వినిపించిన వేళ//సంగమం//

సంక్షిప్త భంగిమలు జతులై ఆడగ
సంక్లిష్ట భావాలు కృతులై పాడగ
శిథిలమైన శిశిర వనములు
కొత్త చిగురులే తొడిగిన వేళ
చేదుగ మిగిలిన జీవన స్మృతులు
మధుర స్మరణలై చేరిన వేళ
తనువులోని అణువణువూ
విరిబాలలై కుసుమించిన వేళ//సంగమం//