Friday, December 9, 2011

ఎద సవ్వడి

పల్లవి:

అ:ఎదలో ఏదో చిరు సవ్వడి
చేసింది ఎంతో అలజడి
నీ మాటే చెవినపడి
ఎగిరింది మది ఎగసిపడి

ఆ:నీ చెంత చేరాలనీ వయసు
రొదపెడుతోంది మనసు
నీతోనే కూడాలనీ ప్రాయం
ముడిపెడుతోంది ప్రాణం

అ:కలలో విహరిస్తోంది తనువు
నీ జత కూడి

ఆ:అలలా ప్రవహిస్తోంది తలపు
నా మతి చెడి //ఎదలో//

చరణం 1:

అ:నీతో కూడిన క్షణమే
కాలం ఆగిపోతే సరి
నీలో కరిగిన ప్రాయమే
చెలరేగిపోదా మరి

ఆ:నీ ఊహలో నేను
శిలలా నిలిచిపోతానులే
నీ ధ్యాసలో నేను
కలలా కలిసిపోతానులే

అ:నా సర్వం నీకేనుగా
నా స్వరం నీదేనుగా

ఆ:నీ చెంత చేరిన మరు నిముషం
నను నేను మరిచానుగా //ఎదలో//

చరణం 2:

అ:నిను చూసిన ప్రతిక్షణం
నాలో అవుతుంది ఏదో అలికిడి
నిను తాకిన మరుక్షణం
నా మది చేస్తుంది ఏదో తడబడి

ఆ:నీ శ్వాసలో శ్వాసనై
అలలా మిగిలిపోతానులే
నీ మనసులో మోహమై
సెగలా రగిలిపోతానులే

అ:నా హృదిలో నీవేనుగా
నా తనువంతా నీ ప్రేమేనుగా

ఆ:నువు నా పక్కనుంటే
ఆ స్వర్గమే నా దవునుగా //ఎదలో//

Wednesday, November 30, 2011

మూగ బంధం

పల్లవి:
-----
అతడు:
మాటలురాని కోయిల ఒకటి
మౌనగీతమే పాడింది
మూగబోయిన హృదయ వీణ
తీయని రాగం పలికింది
గమ్యం లేని జీవితానికి
దేవుడిచ్చిన వరమేలే ఇది //మాటలురాని//

చరణం 1:
---------
అతడు:
ఏనాటి బంధమో ఇది
విడరాని అనుబంధమైనది
అనురాగము పంచుతూ
అభిమానము పెంచుతూ
ఒక దేవతగా నిలిచింది
ఏ భావ చిత్రమో ఇది
నా జతన చేరింది
వెలుగులు చిమ్ముతూ
వలపులు చిందుతూ
ఎదలో మధురిమ నింపింది //మాటలురాని//

చరణం 2:
---------
అతడు:
బీడువారిన ఎడారిలో
పూవులవానే కురిసింది
చితికిపోయిన చీకటి బ్రతుకులో
కొత్తవెలుగులా వచ్చింది
ఊహించని ఆశల పల్లకి
ఎదురుగ నిలబడి పిలిచింది

ఆమె:
ఆగిపోయిన మూగ భాషకు
అక్షరమొదిగిన శిల్పివి నీవు
నేల రాలిన పూలతీగకు
ప్రాణం పోసిన మాలివి నీవు //మాటలురాని//

Friday, October 21, 2011

ఎడారి పుష్పం

ఎడారిలో పూచిన పూవును నేను
పొదరింటికై వేచిన తీవెను నేను
పెనుతుఫానులో చిక్కిన నావను నేను
తీరం కనరాక నడి సంద్రాన నిలిచి ఉన్నాను //ఎడారిలో//

ఎవరో ఒకరు ఎపుడో అపుడు
ఈదారిలో వచ్చి నను చేరదీసి
తనదానిగా చేసుకుంటాడని
ఈచెరనుండి నన్ను విడిపిస్తాడని
ఎదను పరచి ఎదురు చూస్తు
మథనపడే కోయిల నేను
వసంతానికై వేచి ఉన్నాను //ఎడారిలో//

నా రాజు ఈరోజు వచ్చాడని
నన్నెంతో మెచ్చి నాకే మనసిచ్చి
తనతో తీసుకెళతాడని
నా తోడు నీడగా ఉంటాడని
కనులు మూసి కలలు కంటు
నిదురించే రేయిని నేను
ఉదయానికై వేచి ఉన్నాను //ఎడారిలో//

Tuesday, October 18, 2011

నీవే నేనంటా

నీవంటే నేనంటా
నీవెంటే నేనుంటా
నీ కంటి పాపను నేనై
కలలెన్నో కంటూ ఉంటా //నీవంటే//

నీ ఊపిరి నేనంటా
నీ ఊహను నేనంటా
నీ మాటలలో నేనుంటా
నీ మౌనంలో నేనే ఉంటా
నీ పెదవులపై వెన్నెల నేనై
తళతళమని వెలుగుతు ఉంటా
నీ చెక్కిలిపై సిగ్గును నేనై
కితకితలే పెడుతూ ఉంటా //నీవంటే//

నీ తలపే నేనంటా
నీ వలపే నేనంటా
నీ జతలో నేనుంటా
నీ వెతలో నీతోనే ఉంటా
నీ పాటలో మాటలు నేనై
సరిగమలే పలుకుతు ఉంటా
నీ బాటలో అడుగులు నేనై
కడదాకా తోడుగ ఉంటా //నీవంటే//

Monday, October 17, 2011

సాగర తీరంలో

సాగర తీరంలో సంధ్యారాగంలో
ఎగసిపడే చిలిపి అలల
మోహన మురళీ గానం
మనసుపడే చెలియ కనుల
మెరిసే వలపు గాలం //సాగర తీరంలో//

మలి సంధ్య మలుపుల్లో
చెలిపెదవి విరుపుల్లో
చిరుగాలి ఊపుల్లో
చలివాడి విసురుల్లో -
కబుర్లాడుకోనీ..
రెండు తేనె మనసులు
పెనవేసుకోనీ..
రెండు కోడె వయసులు
నులివెచ్చని బిగి కౌగిట
సేద దీరుకోనీ..
రెండు ప్రేమ పావురాలు //సాగర తీరంలో//

తుళ్లిపడే సాగర కెరటాలు
చల్లబడెను తీరం చేరి
అదిరిపడే చెలి అధరాలు
కుదుట పడెను మోహం తీరి -
నెమరువేసుకోనీ..
గడచిన తీపి జ్ఞాపకాలు
ఎదను పరచుకోనీ..
గడిపిన మధుర క్షణాలు
చిరుచెమటల తడి సందిట
తిరిగి రాసుకోనీ..
వలపు ప్రేమ పాఠాలు //సాగర తీరంలో//

Tuesday, October 11, 2011

పల్లె రోదన

రతనాల మా పల్లె నేడు
రాళ్లగుట్టగా మారింది చూడు
సిరులు పండినా మాగాణి నాడు
కరువు కోరల్లో చిక్కింది చూడు
చేయూతనిచ్చే నాథుడే లేడు
ఎవరు వింటారయ్య ఈ రైతన్న గోడు //రతనాల//

అప్పొ సప్పో చేసి పెట్టుబడులే పెట్టి
పంట చేతికి రాక పడరాని పాట్లు పడి
అప్పు తీర్చాలేకా మింగమెతుకూ కనక
ఇల్లు నడపా లేక పిల్లలను పోషించ లేక
భవిత కానారాక భిక్షమెత్తాలేక
పురుగుమందే పదిలమనుకొని
ప్రాణాలు వదిలేను పాపము రైతన్న //రతనాల//

పుచ్చిపోయిన విత్తనాలు
పెరిగిపోయే ఎరువు ధరలు
కూలబడిన కాడి ఎద్దులు
ఇంకిపోయిన తోట బావులు
విద్యుత్తులేని కరెంటు తీగలు
మద్దతే కరవైన ప్రభుత్వ రీతులు
గుండె చప్పుడు ఆగిపోయి
చావుడప్పులు మోగుతుంటే
చేలు చేసే మూగ రోదన
చెవిన పడెనా ఎవరికైనా? //రతనాల//

Monday, October 10, 2011

పల్లె ఏడుస్తున్నాది

పల్లె తల్లడిల్లుతున్నాది
నా పల్లె గొల్లుమంటున్నాది
పల్లెలోని ఇల్లు ఇల్లూ
బతుకుజీవుడాయని ఏడుస్తున్నాది //పల్లె//

పచ్చగ ఉన్న పొలాలన్నీ
ఏడారిలా ఎండిపోయె
వానసినుకు నేలరాలక
భూములన్నీ బీడులాయె
తిండిగింజలే కానరాక
గంజినీళ్లే కరువాయె
రోగమొచ్చి మంచానపడితే
మందు మాకూ లేకపోయె
కళకళలాడిన ఊరంతా
వల్లకాడుగ మారిపోయె //పల్లె//

గుండెనిండా నిండుకున్న
బాధలే మా చుట్టాలాయె
ఎదురుచూపులకు బదులుగా
మాకుమిగిలేది కన్నీళ్లేగా
పల్లె కన్నీరు పెడుతూఉంటే
దేశమేగతి బాగుపడునురా
తల్లిపాలే ఇంకిపోతే
పిల్లలేరీతి ఎదుగునురా
ఇకనైనా కళ్లు తెరచి
పల్లెను బతికించుకుందామురా
మన పల్లెలను బతికించుకుందామురా//పల్లె//

Monday, September 26, 2011

హేయ్‌ బ్యూటీ

(ఈ మధ్య వస్తున్న సినిమా పాటల ట్రెండుకనుగుణంగా ఒక చిన్న ప్రయత్నం చేశాను..ఈ కింది పాటలో..ఎలా ఉందో చెప్పండి)

హేయ్‌ బ్యూటీ...
జర ముడ్‌ కే దేఖో పీఛే
నా మాటే...
జర బోల్‌ నేదో తుంసే
నీ అందమే నను చుట్టేసిందే
అది బంధమై నను కట్టేసిందే
నిన్నిక వదలనే నన్నెంతగా తిట్టినా
తుంసే ప్యార్‌ హై సనం నీమీదొట్టుగా //హేయ్‌ బ్యూటీ...//

ఆగే ఆగే నువు పోతూ ఉంటే
పీఛే పీఛే నేవస్తూ ఉంటే
చూసేవాళ్లేమనుకుంటారే
నీ పరుగు ఆపి నాతో వస్తే
నాకున్నదంత నీకే ఇస్తానే
ఆవో సాథ్‌ సాథ్‌ జీయేంగే
సాథ్‌ మిల్‌ కే ఘూమేంగే
చచ్చే దాక చెయ్యి వదలనే
నువ్వొచ్చేదాకా పట్టు వీడనే //హేయ్‌ బ్యూటీ...//

ఇన్నాళ్లు తిరిగానే అవారాగా
నీ ప్రేమ లో పడిపోయానే దీవానాగా
నువు కాదంటే ఐపోతానే పాగల్‌ గానిగా
నీ అందానికే లేదే పోటీ
ఈ పోకిరిగానికి లేదే సాటి
మేరీ బాత్‌ సున్‌ లో పోరీ
తిరుగులేనిదే హం దోనోంకా జోడీ
ఇంకా ఎందుకే ఆ బింకం
వదిలిపెట్టవే నీ పంతం //హేయ్‌ బ్యూటీ...//

నిన్నే చూస్తున్నా(Revised)

పల్లవి:
నిన్నే చూస్తున్నా
నీవెంటే వస్తున్నా
నీ ఊహలలో...
నీ ఊపిరిలో...
పాగా వేస్తున్నా...
నిన్నే చూస్తున్నా...
నిన్నే చూస్తున్నా.....//నిన్నే చూస్తున్నా//

చరణం 1:
నాకిది కొత్తగా ఉన్నా
నీకది వింతగా తోస్తున్నా
నీతోనే నేననుకున్నా
నీతోనే నే కలగన్నా
ఎదలో వలపును రగిలించీ
ఏమీ పట్టనట్టు వెళుతున్నావు
నీకిది న్యాయమా..ప్రియతమా...//నిన్నే చూస్తున్నా//

చరణం 2:
నీ ప్రేమే నాదనుకున్నా
నా బ్రతుకే నీదనుకున్నా
నీ శ్వాసే నాప్రాణమనీ
నీ ధ్యాసే నా లోకమనీ
కలలెన్నో కన్నాను
కాలాన్నే మరచాను
నా దరి చేరవా.. ప్రియతమా...//నిన్నే చూస్తున్నా//

రంగుల కల

పల్లవి:
రంగుల కలలో..
ఊహల వలలో..
విహరించే చెలీ
ఆశల ఒడిలో..
వేదన జడిలో..
నిదురించే సఖీ
కనులు తెరచి ఇటు చూడొకసారి
నీ ఎదుట నిలిచింది నిజం విసిగి వేసారి //రంగుల కలలో//

చరణం 1:
ఆకాశమే అందుకోవాలని
తారలనే చేరుకోవాలని
వెన్నెలనే కోసుకోవాలని
ఆశపడిన ఓ చిలకమ్మా
నేలకు దిగి రావమ్మా
నిజమేదో తెలుసుకోవమ్మా... //రంగుల కలలో//

చరణం 2:
ఇంద్ర ధనసుపై నడవాలని
మేఘాలతో ఆడుకోవాలని
స్వర్గానికి వంతెన వేయాలని
కలలు కన్న ఓ చిట్టెమ్మా
నిదుర వీడి లేవమ్మా
చుట్టూ ఓసారి చూసుకోవమ్మా... //రంగుల కలలో//

Monday, September 19, 2011

సినిమా జీవితం

సినిమా సినిమా సినిమా
చూడర బాబూ సినిమా
సినిమా లేని జీవితం
బ్రతకడమే నిరర్థకం
నీలో ఉన్న బాధలన్నీ
ఒక సినిమా చూస్తే మటుమాయం //సినిమా సినిమా//

రోజంతా కష్టపడి
సాయంత్రం సినిమాకొస్తే
ఒంట్లోని నీరసమంతా
చిటికెలో అదృశ్యం
నిద్రలో నీ కలలన్నీ
కళ్లముందే సాక్షాత్కారం
సినిమా హాల్లో మూడుగంటలూ
నువ్వే హీరో రెచ్చిపో
కాసేపైనా ఊరటనిచ్చే
సినిమాయే నీ నేస్తమురా
చిరాకులన్నీ దూరం చేసే
మహామంత్రమే సినిమారా//సినిమా సినిమా//

నీ చుట్టూ జరిగేదే
సినిమా నీకు చూపిస్తుంది
సినిమాలో నువు చూసేదే
నీ చుట్టూ తిరుగుతు ఉంది
సినిమాయేరా జీవితం
మనలో కొందరికీ
సినిమాలు చూడందే
నిదుర రాదు ఎంతోమందికి
సినిమా హీరోలే వీళ్లకు
కనిపించే దైవాలూ
వారి కోసం ఏమైనా
చేస్తారులే అభిమానులు//సినిమా సినిమా//

Friday, September 16, 2011

నిన్నే చూస్తున్నా

పల్లవి:
నిన్నే చూస్తున్నా
నీవెంటే వస్తున్నా
నీ ఊహలలో...
నీ ఊపిరిలో...
పాగా వేస్తున్నా...
నిన్నే చూస్తున్నా..... //నిన్నే చూస్తున్నా//

చరణం 1:
నాకేదో కొత్తగా ఉన్నా
నీకేమీ తెలియనట్టున్నా
నీతోనే నేననుకున్నా
నీతోనే నే కలగన్నా
ఎదలో అగ్గి రాజేసి
ఏమీ ఎరగనట్టు వెళుతున్నావు
నీకిది న్యాయమా..ప్రియతమా...//నిన్నే చూస్తున్నా//

చరణం 2:
నీ ప్రేమే నాదనుకున్నా
బ్రతుకే నీకు దాసోహమన్నా
నీ శ్వాసే నాప్రాణమనుకున్నా
నీ ధ్యాసే నా లోకమనుకున్నా
పరువాన్నే ఉసిగొలిపావు
నా హృదయాన్నే తట్టి లేపావు
నా ఆవేదనా ..తీర్చవా..//నిన్నే చూస్తున్నా//

Wednesday, September 14, 2011

జోజో లాలీ..జోజో లాలీ..

పల్లవి:
జోజో లాలీ జోజో లాలీ
ఆదమరచీ నువు నిదురపోవాలీ
ఆ నిదురలో తీయనీ
కలలే....కనాలీ
జోజో లాలీ జోజో లాలీ //జోజో లాలీ//

చరణం 1:
నీ బోసినవ్వులే మాకు
మణులూ మాణిక్యాలు
నీ చిలిపి కేరింతలే మాకు
ఆ దేవుడిచ్చిన వరాలు
బుడి బుడి నీ నడకలే మాకు
హాయి గొలుపు వేడుకలు
రోజంతా ఆడి నీవు అలసిపోయావురా కన్నా
ఇకనైన నిదురించి నీ అలుపు తీర్చుకోర నాన్న
మా చిట్టి పాపా..మా గారాల పట్టీ//జోజో లాలీ//

చరణం 2:
ఏ జన్మ సుకృతమో
మా ఇంట వెలిశావు
ఏ నోముల ఫలమో
మా కంటి పాపవైనావు
సేదతీరా నిదురపో
నీ కలతలన్నీ మరచిపో
నీ రాకతో నిండెనమ్మ మా లోగిలిలో వెలుగులు
నీ నవ్వుతో పండెనమ్మ మేము కన్న కలలు
ఓ ముద్దుల తల్లీ..మా కల్పవల్లీ//జోజో లాలీ//

Monday, September 12, 2011

నిన్నా మొన్నా లేనిది ఏదో

నిన్నా మొన్నా లేనిది ఏదో
నేడే నాలో మొదలయ్యింది
పగలూ రాత్రీ తేడా తెలియక
నిన్నే కలవరిస్తోంది
అది ఏమిటో ప్రియా... తెలుపవా
నీమదిలో నన్నే ...నిలుపవా //నిన్నా మొన్నా//

నిను ఏ క్షణమైతే చూశానో
నన్ను నేనే మరిచానూ
నీ ఊహలలో తేలిపోతూ
నా ఉనికిని ఎపుడో వదిలేశాను
నన్ను నీలో చూసుకుంటూ
జీవితమంతా గడిపేస్తాను
నీతోనే పయనిస్తూ
వెయ్యేళ్లైనా బ్రతికేస్తాను//నిన్నా మొన్నా//

నీ చుట్టూ ఇంత జరిగినా
అసలేమీ పట్టదా నీకు
నను కట్టేసిన నీమనసునకు
వినిపించదా నా పిలుపు
ఇంత కఠినమా నీ హృదయం
ఉలుకూ పలుకు లేనే లేదు
ఒక్కసారి తొంగి చూడు
నీ ఎదలోనే ఒదిగున్నా నేను //నిన్నా మొన్నా//

Sunday, September 4, 2011

గురువే దైవం


సాకీ:
గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః
గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్‌ పరబ్రహ్మ
తస్మైశ్రీ గురవేనమః

పల్లవి:
నీ జ్ఞానానికి మూలం
నీ ధ్యానానికి మూలం
నీ మంత్రానికి మూలం
నీ ముక్తికి మార్గం గురువే కదా...
గురువంటే దైవం
గురువంటే విశ్వం
గురువంటే సమస్తం
ఆ గురువుకు చేయాలి
ప్రతి ఉదయం నమస్కారం... //నీ జ్ఞానానికి//

చరణం 1:
మాతృదేవోభవ...
పితృదేవోభవ...
ఆచార్య దేవోభవ...
గురువంటే నీ మాతాపితలతో సమానం
అందుకే సేవించాలి ఆయనను అనుదినం
నీకూ ఆ దేవునికి మథ్య ఉన్న
వారథియేరా గురువు
గురువు మాట వినకుంటే
లేదు నీకు బ్రతుకు తెరువు...
తల్లీ తండ్రీ గురువూ..
నీకు కనిపించే దైవాలు
వారిని పూజించిన చాలు
ఆదేవుని కరుణ నీపై వాలు... //నీ జ్ఞానానికి//

చరణం 2:
గురువంటే జ్ఞానం
గురువంటే యోగం
గురువంటే యజ్ఞం...
ఆ గురువు నీకు చూపించే మార్గము
ఇహపరాన దక్కించును సౌఖ్యము
మంచేదో చెడు ఏదో
నీకు తెలిపేది గురువూ..
మంచి మార్గాన
నిన్ను నడిపేది గురువూ..
నీకూ గురువుకు ఉన్న బంధము
అది ఒక అద్వితీయ అనుబంధము
ఆ అనుబంధానికి మించి లేదు
మరి ఏ పవిత్ర సంబంధము //నీ జ్ఞానానికి//

Thursday, September 1, 2011

సంగమం


సంగమం.. రాగాంగ సంయోగం
రాగానురాగాల సంధానం
ఇది నా హృదయము అర్పించు
సుమగాన సంకీర్తనం //సంగమం//

కన్నీటి కెరటాలు అలలైసాగగ
మంజీర నాదాలు ఝరులై పారగ
మదిలో దాగిన అక్షర మాలలు
వెల్లువలై పొంగిన వేళ
మూగబోయిన అందెల రవళులు
దిగంతాలను తాకిన వేళ
ప్రకృతిలోని ప్రతి పిలుపూ
ప్రణవ రాగమై వినిపించిన వేళ//సంగమం//

సంక్షిప్త భంగిమలు జతులై ఆడగ
సంక్లిష్ట భావాలు కృతులై పాడగ
శిథిలమైన శిశిర వనములు
కొత్త చిగురులే తొడిగిన వేళ
చేదుగ మిగిలిన జీవన స్మృతులు
మధుర స్మరణలై చేరిన వేళ
తనువులోని అణువణువూ
విరిబాలలై కుసుమించిన వేళ//సంగమం//

Saturday, August 27, 2011

జీవితమొక సంగ్రామం


(విధి వక్రించి యాక్సిడెంట్స్‌ లో వెన్నెముక విరగ్గొట్టుకొని వీల్‌ చైరుకు పరిమితమైన కొంతమంది అభాగ్యులు మొక్కవోని ధైర్యంతో పాడుకుంటున్న పాట..)

జీవితమొక చెలగాటం
అంతులేని పోరాటం
ఆశ నిరాశలమధ్య సాగే సంగ్రామం
వెన్ను విరిగినా కన్ను చెదిరినా
అంతిమ విజయం మాదేలే
అపజయమన్నది లేనే లేదులే //జీవితమొక//

కాళ్లు చచ్చిపోయినా
మా చేవ చావ లేదులే
వెన్నెముక విరిగిపోయినా
మా ధైర్యం కరగ లేదులే
ఆశే ఊపిరిగా
ఆశయమే బాసటగా
ముందుకు సాగిపోతాములే..
విధి వక్రించినా
కాలం వెక్కిరించినా
ఊపిరి ఉన్నంత వరకు పోరాడేములే
ఆశల సౌధాలను చేరుకుంటాములే //జీవితమొక//

నడవలేక పోయినా
మా ఆలోచన ఉరికేనులే
నిలబడలేక పోయినా
మా నమ్మకం సడల లేదులే
ఒకరికి స్ఫూర్తిగా
ఇంకొకరికి ప్రేరణగా
రేపటిలోకి పయనించేములే..
కష్టాలెన్నెదురైనా
కలతలెన్ని పలకరించినా
అకుంఠిత దీక్షతో బ్రతికేములే
బ్రతుకంటే అర్థం చెబుతాములే //జీవితమొక//

Wednesday, July 13, 2011

ప్రేమ రాగం


ఏదో ఏదో నా హృదయం
పలికిందొక రాగం
ప్రేమో ఏమో నా మదిలో
విరిసిందొక భావం
నా మనసే పాడిందీ
నీ వైపే నడిచిందీ
నిను విడిచీ పోలేకా
నీ చెంతనె నిలిచిందీ //ఏదో ఏదో//


ఆశలు ఊహల పల్లకిలో
ఊరేగే ఊరంతా
నీ నీడల జాడలలో
తిరిగేనే రోజంతా
నా బ్రతుకే నీవెంటా
నా ప్రాణం నీదంటా
కొండాకోనా గుసగుసలాడే
నీదీ నాదీ ప్రేమంటా //ఏదో ఏదో//


కోయిల పాడే పాటలలో
నీ పిలుపే వినిపించే
కిలకిలనవ్వే చిలుకల్లే
నాతోనే పయనించే
నీ మాటే నాదంటా
నా మనసే నీదంటా
ఎదలోగుడిగంటలు మ్రోగే
నీకూ నాకూ పెళ్లంటా //ఏదో ఏదో//

Friday, July 1, 2011

నీ రాక ముందుగ తెలుపర స్వామీ


నీ రాక ముందుగ తెలుపర స్వామీ
నీ పూజకు తేవాలి పూలూ ఫలములు
ఆకలిగొని నీవిట అడుగిడితే
నేనేమి చేతురా నీ ఆకలి తీర్చగ //నీ రాక//

జీవితమంతా నీ దర్శనానికై
ఎదురు చూస్తూ నిలిచానూ
వీచే గాలుల సవ్వడి వినబడి
నీవువచ్చే అలికిడి అనుకొని
ఉదుటున పరుగిడి చూశాను
నిను గాంచ లేకున్నా...నీ..
అడుగుల గురుతులే చాలునురా
ఈ జన్మ కదే భాగ్యమురా //నీ రాక//

ప్రతి దినము నీ పాదసేవకై
ఏరి కూరిన పూలమాలలు
నీకై వేచి వగచి వాడెనురా
నీ సుందరవదనము చూడాలని
నీ చరణారవిందములు తాకాలని
గంపెడాశతో బ్రతికేనురా..
ఒక క్షణమైనా నిను చూసీ
ఈ ప్రాణము విడిచిన చాలునురా //నీ రాక//

Monday, June 20, 2011

ఎవరమ్మా నీవెవరమ్మా


బాపూ బొమ్మవా
శ్రీ శ్రీ కవితవా
పరిమళాలు వెదజల్లే
అన్నమయ్య కీర్తనవా
నా మనసే దోచుకున్న
కృష్ణశాస్త్రి గీతికవా
ఎవరమ్మా నీవెవరమ్మా...//బాపూ బొమ్మవా//

మల్లెల తోటలో విరబూసిన
సన్నజాజి తీగవా
ఊరు చివర కొలనులో అరవిచ్చిన
ఎర్రకలువ పూవువా
ఆమని కోయిల తీయగ పాడే
మధురమైన పాటవా..
గలగల పారే సెలయేటి సవ్వడివా..
ఎవరమ్మా నీవెవరమ్మా..//బాపూ బొమ్మవా//

సాయంత్రం వేళలో మెల్లగ వీచే
చల్లని పిల్ల గాలివా
వేసవివేడిలో హాయిగ కురిసే
తొలకరి చిరుజల్లువా
హేమంత ఋతువులో వేడిని రగిలించే
నులివెచ్చని కౌగిలివా..
రవివర్మ చిత్రించిన రంగుల కలవా..
ఎవరమ్మా నీవెవరమ్మా.. //బాపూ బొమ్మవా//