Sunday, September 4, 2011
గురువే దైవం
సాకీ:
గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః
గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ
తస్మైశ్రీ గురవేనమః
పల్లవి:
నీ జ్ఞానానికి మూలం
నీ ధ్యానానికి మూలం
నీ మంత్రానికి మూలం
నీ ముక్తికి మార్గం గురువే కదా...
గురువంటే దైవం
గురువంటే విశ్వం
గురువంటే సమస్తం
ఆ గురువుకు చేయాలి
ప్రతి ఉదయం నమస్కారం... //నీ జ్ఞానానికి//
చరణం 1:
మాతృదేవోభవ...
పితృదేవోభవ...
ఆచార్య దేవోభవ...
గురువంటే నీ మాతాపితలతో సమానం
అందుకే సేవించాలి ఆయనను అనుదినం
నీకూ ఆ దేవునికి మథ్య ఉన్న
వారథియేరా గురువు
గురువు మాట వినకుంటే
లేదు నీకు బ్రతుకు తెరువు...
తల్లీ తండ్రీ గురువూ..
నీకు కనిపించే దైవాలు
వారిని పూజించిన చాలు
ఆదేవుని కరుణ నీపై వాలు... //నీ జ్ఞానానికి//
చరణం 2:
గురువంటే జ్ఞానం
గురువంటే యోగం
గురువంటే యజ్ఞం...
ఆ గురువు నీకు చూపించే మార్గము
ఇహపరాన దక్కించును సౌఖ్యము
మంచేదో చెడు ఏదో
నీకు తెలిపేది గురువూ..
మంచి మార్గాన
నిన్ను నడిపేది గురువూ..
నీకూ గురువుకు ఉన్న బంధము
అది ఒక అద్వితీయ అనుబంధము
ఆ అనుబంధానికి మించి లేదు
మరి ఏ పవిత్ర సంబంధము //నీ జ్ఞానానికి//
Thursday, September 1, 2011
సంగమం
సంగమం.. రాగాంగ సంయోగం
రాగానురాగాల సంధానం
ఇది నా హృదయము అర్పించు
సుమగాన సంకీర్తనం //సంగమం//
కన్నీటి కెరటాలు అలలైసాగగ
మంజీర నాదాలు ఝరులై పారగ
మదిలో దాగిన అక్షర మాలలు
వెల్లువలై పొంగిన వేళ
మూగబోయిన అందెల రవళులు
దిగంతాలను తాకిన వేళ
ప్రకృతిలోని ప్రతి పిలుపూ
ప్రణవ రాగమై వినిపించిన వేళ//సంగమం//
సంక్షిప్త భంగిమలు జతులై ఆడగ
సంక్లిష్ట భావాలు కృతులై పాడగ
శిథిలమైన శిశిర వనములు
కొత్త చిగురులే తొడిగిన వేళ
చేదుగ మిగిలిన జీవన స్మృతులు
మధుర స్మరణలై చేరిన వేళ
తనువులోని అణువణువూ
విరిబాలలై కుసుమించిన వేళ//సంగమం//
Saturday, August 27, 2011
జీవితమొక సంగ్రామం
(విధి వక్రించి యాక్సిడెంట్స్ లో వెన్నెముక విరగ్గొట్టుకొని వీల్ చైరుకు పరిమితమైన కొంతమంది అభాగ్యులు మొక్కవోని ధైర్యంతో పాడుకుంటున్న పాట..)
జీవితమొక చెలగాటం
అంతులేని పోరాటం
ఆశ నిరాశలమధ్య సాగే సంగ్రామం
వెన్ను విరిగినా కన్ను చెదిరినా
అంతిమ విజయం మాదేలే
అపజయమన్నది లేనే లేదులే //జీవితమొక//
కాళ్లు చచ్చిపోయినా
మా చేవ చావ లేదులే
వెన్నెముక విరిగిపోయినా
మా ధైర్యం కరగ లేదులే
ఆశే ఊపిరిగా
ఆశయమే బాసటగా
ముందుకు సాగిపోతాములే..
విధి వక్రించినా
కాలం వెక్కిరించినా
ఊపిరి ఉన్నంత వరకు పోరాడేములే
ఆశల సౌధాలను చేరుకుంటాములే //జీవితమొక//
నడవలేక పోయినా
మా ఆలోచన ఉరికేనులే
నిలబడలేక పోయినా
మా నమ్మకం సడల లేదులే
ఒకరికి స్ఫూర్తిగా
ఇంకొకరికి ప్రేరణగా
రేపటిలోకి పయనించేములే..
కష్టాలెన్నెదురైనా
కలతలెన్ని పలకరించినా
అకుంఠిత దీక్షతో బ్రతికేములే
బ్రతుకంటే అర్థం చెబుతాములే //జీవితమొక//
Wednesday, July 13, 2011
ప్రేమ రాగం
ఏదో ఏదో నా హృదయం
పలికిందొక రాగం
ప్రేమో ఏమో నా మదిలో
విరిసిందొక భావం
నా మనసే పాడిందీ
నీ వైపే నడిచిందీ
నిను విడిచీ పోలేకా
నీ చెంతనె నిలిచిందీ //ఏదో ఏదో//
ఆశలు ఊహల పల్లకిలో
ఊరేగే ఊరంతా
నీ నీడల జాడలలో
తిరిగేనే రోజంతా
నా బ్రతుకే నీవెంటా
నా ప్రాణం నీదంటా
కొండాకోనా గుసగుసలాడే
నీదీ నాదీ ప్రేమంటా //ఏదో ఏదో//
కోయిల పాడే పాటలలో
నీ పిలుపే వినిపించే
కిలకిలనవ్వే చిలుకల్లే
నాతోనే పయనించే
నీ మాటే నాదంటా
నా మనసే నీదంటా
ఎదలోగుడిగంటలు మ్రోగే
నీకూ నాకూ పెళ్లంటా //ఏదో ఏదో//
Friday, July 1, 2011
నీ రాక ముందుగ తెలుపర స్వామీ
నీ రాక ముందుగ తెలుపర స్వామీ
నీ పూజకు తేవాలి పూలూ ఫలములు
ఆకలిగొని నీవిట అడుగిడితే
నేనేమి చేతురా నీ ఆకలి తీర్చగ //నీ రాక//
జీవితమంతా నీ దర్శనానికై
ఎదురు చూస్తూ నిలిచానూ
వీచే గాలుల సవ్వడి వినబడి
నీవువచ్చే అలికిడి అనుకొని
ఉదుటున పరుగిడి చూశాను
నిను గాంచ లేకున్నా...నీ..
అడుగుల గురుతులే చాలునురా
ఈ జన్మ కదే భాగ్యమురా //నీ రాక//
ప్రతి దినము నీ పాదసేవకై
ఏరి కూరిన పూలమాలలు
నీకై వేచి వగచి వాడెనురా
నీ సుందరవదనము చూడాలని
నీ చరణారవిందములు తాకాలని
గంపెడాశతో బ్రతికేనురా..
ఒక క్షణమైనా నిను చూసీ
ఈ ప్రాణము విడిచిన చాలునురా //నీ రాక//
Monday, June 20, 2011
ఎవరమ్మా నీవెవరమ్మా
బాపూ బొమ్మవా
శ్రీ శ్రీ కవితవా
పరిమళాలు వెదజల్లే
అన్నమయ్య కీర్తనవా
నా మనసే దోచుకున్న
కృష్ణశాస్త్రి గీతికవా
ఎవరమ్మా నీవెవరమ్మా...//బాపూ బొమ్మవా//
మల్లెల తోటలో విరబూసిన
సన్నజాజి తీగవా
ఊరు చివర కొలనులో అరవిచ్చిన
ఎర్రకలువ పూవువా
ఆమని కోయిల తీయగ పాడే
మధురమైన పాటవా..
గలగల పారే సెలయేటి సవ్వడివా..
ఎవరమ్మా నీవెవరమ్మా..//బాపూ బొమ్మవా//
సాయంత్రం వేళలో మెల్లగ వీచే
చల్లని పిల్ల గాలివా
వేసవివేడిలో హాయిగ కురిసే
తొలకరి చిరుజల్లువా
హేమంత ఋతువులో వేడిని రగిలించే
నులివెచ్చని కౌగిలివా..
రవివర్మ చిత్రించిన రంగుల కలవా..
ఎవరమ్మా నీవెవరమ్మా.. //బాపూ బొమ్మవా//
Friday, June 17, 2011
వర్షంతో స్నేహం
వానా వానా వానా
నా చెంప నిమిరి పోవమ్మా
చిననాటి నేస్తం లేకున్నా
నీ తోడే నాకు చాలమ్మా
నేనేడ్చిన ప్రతిసారీ
నువ్వు నన్ను చేరాలమ్మా
నా కన్నీరెవరికి కనపడకుండా
తుడిచి వెళ్లి పోవాలమ్మా //వానా వానా//
దూరమైన చిననాటి స్నేహం
మళ్లీ చిగురించేనా
ఇన్నాళ్లకు కలిసిన నేస్తం
తిరిగి దూరమయ్యేనా
ఎలా మరచిపోనమ్మా మా నేస్తాన్నీ
ఎలా చంపుకోనమ్మా ఈ స్నేహాన్నీ
మా మథ్యన మిగిలిందొక
పెను అగాథమేనా..
విథి రాసిన రాతలో
మాదొక వింత కథయేనా.. //వానా వానా//
ఒక బండరాయిలా నేను
పైకి కనిపిస్తున్నా
లోలోన వర్షించే
కారు మబ్బులా ఉన్నా
తీరమెంత శాంతమైనా
కడలి అలలు దాగేనా
నాలో రేగే అలజడిని
ఈ అలలు మింగగలిగేనా
ఈ వర్షం వెలిసే లోగా
మనసారా ఏడవగలనా... //వానా వానా//
Subscribe to:
Posts (Atom)






