ఓటమితో ధైర్యము వీడకు
నిరాశతో దిగాలు పడకు
కన్నీళ్లతో కాలం గడపకురా...
నిన్న నీది కాదనుకుంటే నేడు నీదే ఔనురా
నేడు కలసి రాకుంటే రేపు ఉండనే ఉందిరా
నమ్మకమే శ్రీరామ రక్షరా
ధైర్యంగా ముందుకు పోతే
గెలుపే నీ పక్షమురా //ఓటమితో//
తప్పటడుగులు వేస్తూనే
నడక నువ్వు నేర్చుకోరా
పెను తుఫానులెదురైనా
నీ గమ్యం చేరుకోరా
కన్నీళ్లెంతగ కార్చినా
కడుపు నీది నిండదురా
ఎదురు దెబ్బలే నీకు
బ్రతుకు నేర్పు పాఠమురా
రాళ్ళువిసిరే వాళ్ళకు
అందనత ఎదగాలిరా
వేలెత్తి చూపినవాళ్ళే
జేజేలు పలకాలిరా //ఓటమితో//
గ్రహణం పట్టిన సూర్యుడు
తిరిగి వెలుగు చిమ్మునురా
మబ్బు పట్టిన చంద్రుడు
మరల వెన్నెల కురియునురా
తెలియక పొరపాటు జరిగితే
జీవితాంతము వగచకురా
తప్పులు సరిదిద్దుకుంటూ
ముందుకు సాగి పోవాలిరా
చిమ్మచీకటి చీల్చుకుంటూ
వెలుగురేఖలు వచ్చునురా
కల్లోలమైన సముద్రమే
గజ ఈతను నేర్పునురా //ఓటమితో//
No comments:
Post a Comment