Monday, June 20, 2011

ఎవరమ్మా నీవెవరమ్మా


బాపూ బొమ్మవా
శ్రీ శ్రీ కవితవా
పరిమళాలు వెదజల్లే
అన్నమయ్య కీర్తనవా
నా మనసే దోచుకున్న
కృష్ణశాస్త్రి గీతికవా
ఎవరమ్మా నీవెవరమ్మా...//బాపూ బొమ్మవా//

మల్లెల తోటలో విరబూసిన
సన్నజాజి తీగవా
ఊరు చివర కొలనులో అరవిచ్చిన
ఎర్రకలువ పూవువా
ఆమని కోయిల తీయగ పాడే
మధురమైన పాటవా..
గలగల పారే సెలయేటి సవ్వడివా..
ఎవరమ్మా నీవెవరమ్మా..//బాపూ బొమ్మవా//

సాయంత్రం వేళలో మెల్లగ వీచే
చల్లని పిల్ల గాలివా
వేసవివేడిలో హాయిగ కురిసే
తొలకరి చిరుజల్లువా
హేమంత ఋతువులో వేడిని రగిలించే
నులివెచ్చని కౌగిలివా..
రవివర్మ చిత్రించిన రంగుల కలవా..
ఎవరమ్మా నీవెవరమ్మా.. //బాపూ బొమ్మవా//

Friday, June 17, 2011

వర్షంతో స్నేహం


వానా వానా వానా
నా చెంప నిమిరి పోవమ్మా
చిననాటి నేస్తం లేకున్నా
నీ తోడే నాకు చాలమ్మా
నేనేడ్చిన ప్రతిసారీ
నువ్వు నన్ను చేరాలమ్మా
నా కన్నీరెవరికి కనపడకుండా
తుడిచి వెళ్లి పోవాలమ్మా //వానా వానా//

దూరమైన చిననాటి స్నేహం
మళ్లీ చిగురించేనా
ఇన్నాళ్లకు కలిసిన నేస్తం
తిరిగి దూరమయ్యేనా
ఎలా మరచిపోనమ్మా మా నేస్తాన్నీ
ఎలా చంపుకోనమ్మా ఈ స్నేహాన్నీ
మా మథ్యన మిగిలిందొక
పెను అగాథమేనా..
విథి రాసిన రాతలో
మాదొక వింత కథయేనా.. //వానా వానా//

ఒక బండరాయిలా నేను
పైకి కనిపిస్తున్నా
లోలోన వర్షించే
కారు మబ్బులా ఉన్నా
తీరమెంత శాంతమైనా
కడలి అలలు దాగేనా
నాలో రేగే అలజడిని
ఈ అలలు మింగగలిగేనా
ఈ వర్షం వెలిసే లోగా
మనసారా ఏడవగలనా... //వానా వానా//

Tuesday, April 12, 2011

రామా నిన్నే నమ్మితిమయ్యా


శ్రీ రఘు రామా సీతారామా
నీ నామ స్మరణే మధురమయా
నీ పాద సేవే మా సౌభాగ్యమయా//శ్రీ రఘు రామా//

కౌసల్య తనయా కోదండ రామా
కైవల్య పద దాత కౌస్తుభ రామా
నీ కర కమలములే...
దీవెనలొసగే దివ్యశయములయా
నీ శుభ చరణములే...
ముక్తిని చూపే పరమ పాదములయా
నీ నామ కీర్తనలే...
భవ సాగరమును దాటించు సుమ తరణములయా//శ్రీ రఘు రామా//

నిరతము నిన్నే కొలిచెదమయ్యా
మదిలో నిన్నే నిలిపెదమయ్యా
నీ చిరునవ్వే మాకు చాలునయ
నీ కరుణ మాపై కురిపించవయా
నీ దాసుల మొర ఆలకించవయ
నీ పాదాల చెంత చేరనీయవయా
నీ కీర్తి వేనోళ్ల పాడెదమయ్య
మా హృదయములో నిత్యము నిదురించవయా//శ్రీ రఘు రామా//

Wednesday, April 6, 2011

జయమ్ము నిశ్చయమ్మురా..

ఓటమితో ధైర్యము వీడకు
నిరాశతో దిగాలు పడకు
కన్నీళ్లతో కాలం గడపకురా...
నిన్న నీది కాదనుకుంటే నేడు నీదే ఔనురా
నేడు కలసి రాకుంటే రేపు ఉండనే ఉందిరా
నమ్మకమే శ్రీరామ రక్షరా
ధైర్యంగా ముందుకు పోతే
గెలుపే నీ పక్షమురా //ఓటమితో//

తప్పటడుగులు వేస్తూనే
నడక నువ్వు నేర్చుకోరా
పెను తుఫానులెదురైనా
నీ గమ్యం చేరుకోరా
కన్నీళ్లెంతగ కార్చినా
కడుపు నీది నిండదురా
ఎదురు దెబ్బలే నీకు
బ్రతుకు నేర్పు పాఠమురా
రాళ్ళువిసిరే వాళ్ళకు
అందనత ఎదగాలిరా
వేలెత్తి చూపినవాళ్ళే
జేజేలు పలకాలిరా //ఓటమితో//

గ్రహణం పట్టిన సూర్యుడు
తిరిగి వెలుగు చిమ్మునురా
మబ్బు పట్టిన చంద్రుడు
మరల వెన్నెల కురియునురా
తెలియక పొరపాటు జరిగితే
జీవితాంతము వగచకురా
తప్పులు సరిదిద్దుకుంటూ
ముందుకు సాగి పోవాలిరా
చిమ్మచీకటి చీల్చుకుంటూ
వెలుగురేఖలు వచ్చునురా
కల్లోలమైన సముద్రమే
గజ ఈతను నేర్పునురా //ఓటమితో//

Thursday, March 31, 2011

నన్ను ప్రేమించొద్దు


వద్దు వద్దు వద్దు
నన్ను ప్రేమించొద్దు
వద్దు వద్దు వద్దు
నాతో మాటాడొద్దు //వద్దు వద్దు//

దొంగ చాటుగా గోడ దూకి
నన్ను కలవద్దు
కిటికీలోంచి సైగలు చేస్తూ
నన్ను పిలవొద్దు
దూరం నుంచే ఎగిరే ముద్దు
నాకు ఇవ్వద్దు
మారువేషంలో నాగదికొచ్చి
అల్లరి పెట్టొద్దు
తియ్యతియ్యని కబుర్లన్నీ
నాకు చెప్పొద్దు //వద్దు వద్దు//

ఫ్రెండునంటూ గొంతు మార్చి
ఫోన్లు చెయ్యొద్దు
ప్రేమలేఖలు తమ్ముడిచేత
అసలే పంపొద్దు
ప్రతి ఉదయం సందుచివర
కాపల కాయొద్దు
సాయంత్రం చెరువుగట్టున
ఎదురు చూడొద్దు
నన్ను కలిసిన ప్రతిసారీ
తీయని ముద్దు ఇవ్వనే ఇవ్వద్దు//వద్దు వద్దు//

Friday, March 25, 2011

స్నేహ గీతం


స్నేహమా నేస్తమా
చెంతకే చేరవా
ప్రాణమా దైవమా
చింతలే తీర్చవా
నీ చెలిమి లేకుంటే
నువు తోడు రాకుంటే
బ్రతుకు చితికి పోవు కదా
చితికి చేరి పోను కథా //స్నేహమా//

బ్రతుకంతా విషాదమై
ముందు వెనుక అగాధమై
నేనే నాకు భారమై
జీవితమే నేరమై
పెనుతుఫానులో చిక్కిన వేళ
మండుటెండలో నడిచే వేళ
అమావాస్య వెన్నెలవై
గాయాలకు లేపనమై
నన్ను చేరదీశావూ
నాతో చేయి కలిపావూ //స్నేహమా//

కలలే రాని కన్నుల్లో
తీపి కథలు నిలిపావూ
ఆశే లేని గుండెల్లో
కొత్త వెలుగు నింపావూ
మన స్నేహం మరపురానిది
నీ సాయం తీర్చలేనిది
నీతో గడిపిన క్షణాలే
నిలిచెను చెరగని జ్ఞాపకాలై
నీకై వేచిన నిముషాలే
పలకరించెను మధురస్మృతులై //స్నేహమా//

Wednesday, March 23, 2011

తెలుగు బాల


ఓ తెలుగు బాలా ఇలా చూడవేలా
నీ కట్టూ బొట్టూ నాకు నచ్చిందే చాలా
ఓ అందాల బొమ్మా ఇటు రావేలనమ్మా
నీ నడకా కులుకూ నాకు నచ్చిందే కొమ్మా //ఓ తెలుగు బాలా//

నీ పట్టు ఓణీ చూసీ
మనసే పారేసీ
నీ చుట్టూ తిరిగానమ్మా ఓ అలివేణీ
నీ వాలుజడనే చూసీ
నిదురే మానేసీ
నీ కలలే కన్నానమ్మా ఓ విరిబోణీ
నీ అడుగులు చేసే అలికిడిలో
నీ మువ్వలు చేసే సవ్వడిలో
రాగాలెన్నో విన్నానమ్మా ఓ కలకంఠీ
ఈ జన్మకు నువ్వే చాలమ్మా
నా ప్రాణం నీదే లేవమ్మా
నువు లేని బ్రతుకే వద్దమ్మా
నీ కోసం ఆదేవుడినైనా ఎదిరిస్తానమ్మా //ఓ తెలుగు బాలా//

నీ కందిరీగ నడుమే చూసీ
మదిలో గుబులేసీ
నీ వెనకే నడిచానమ్మా ఓ యువరాణీ
నీ కలువ రేకుల కనులే చూసీ
నన్ను నేనే మరచీ
నీ ధ్యానమే చేశానమ్మా ఓ గజగామీ
నీ చూపులు విసిరిన భాషలలో
నీ జడలో తురిమిన మల్లెలలో
నవ్వులు ఎన్నో చూశానమ్మా ఓ మధువాణీ
నువ్వాదేవుడిచ్చిన వరమమ్మా
నువు పక్కన వుంటే చాలమ్మా
ఇంకేమీ నాకు వద్దమ్మా
నీకోసం ఎన్నాళ్ళైనా వేచి వుంటానమ్మా //ఓ తెలుగు బాలా//