Tuesday, October 11, 2011

పల్లె రోదన

రతనాల మా పల్లె నేడు
రాళ్లగుట్టగా మారింది చూడు
సిరులు పండినా మాగాణి నాడు
కరువు కోరల్లో చిక్కింది చూడు
చేయూతనిచ్చే నాథుడే లేడు
ఎవరు వింటారయ్య ఈ రైతన్న గోడు //రతనాల//

అప్పొ సప్పో చేసి పెట్టుబడులే పెట్టి
పంట చేతికి రాక పడరాని పాట్లు పడి
అప్పు తీర్చాలేకా మింగమెతుకూ కనక
ఇల్లు నడపా లేక పిల్లలను పోషించ లేక
భవిత కానారాక భిక్షమెత్తాలేక
పురుగుమందే పదిలమనుకొని
ప్రాణాలు వదిలేను పాపము రైతన్న //రతనాల//

పుచ్చిపోయిన విత్తనాలు
పెరిగిపోయే ఎరువు ధరలు
కూలబడిన కాడి ఎద్దులు
ఇంకిపోయిన తోట బావులు
విద్యుత్తులేని కరెంటు తీగలు
మద్దతే కరవైన ప్రభుత్వ రీతులు
గుండె చప్పుడు ఆగిపోయి
చావుడప్పులు మోగుతుంటే
చేలు చేసే మూగ రోదన
చెవిన పడెనా ఎవరికైనా? //రతనాల//

No comments:

Post a Comment