Friday, December 9, 2011

ఎద సవ్వడి

పల్లవి:

అ:ఎదలో ఏదో చిరు సవ్వడి
చేసింది ఎంతో అలజడి
నీ మాటే చెవినపడి
ఎగిరింది మది ఎగసిపడి

ఆ:నీ చెంత చేరాలనీ వయసు
రొదపెడుతోంది మనసు
నీతోనే కూడాలనీ ప్రాయం
ముడిపెడుతోంది ప్రాణం

అ:కలలో విహరిస్తోంది తనువు
నీ జత కూడి

ఆ:అలలా ప్రవహిస్తోంది తలపు
నా మతి చెడి //ఎదలో//

చరణం 1:

అ:నీతో కూడిన క్షణమే
కాలం ఆగిపోతే సరి
నీలో కరిగిన ప్రాయమే
చెలరేగిపోదా మరి

ఆ:నీ ఊహలో నేను
శిలలా నిలిచిపోతానులే
నీ ధ్యాసలో నేను
కలలా కలిసిపోతానులే

అ:నా సర్వం నీకేనుగా
నా స్వరం నీదేనుగా

ఆ:నీ చెంత చేరిన మరు నిముషం
నను నేను మరిచానుగా //ఎదలో//

చరణం 2:

అ:నిను చూసిన ప్రతిక్షణం
నాలో అవుతుంది ఏదో అలికిడి
నిను తాకిన మరుక్షణం
నా మది చేస్తుంది ఏదో తడబడి

ఆ:నీ శ్వాసలో శ్వాసనై
అలలా మిగిలిపోతానులే
నీ మనసులో మోహమై
సెగలా రగిలిపోతానులే

అ:నా హృదిలో నీవేనుగా
నా తనువంతా నీ ప్రేమేనుగా

ఆ:నువు నా పక్కనుంటే
ఆ స్వర్గమే నా దవునుగా //ఎదలో//

Wednesday, November 30, 2011

మూగ బంధం

పల్లవి:
-----
అతడు:
మాటలురాని కోయిల ఒకటి
మౌనగీతమే పాడింది
మూగబోయిన హృదయ వీణ
తీయని రాగం పలికింది
గమ్యం లేని జీవితానికి
దేవుడిచ్చిన వరమేలే ఇది //మాటలురాని//

చరణం 1:
---------
అతడు:
ఏనాటి బంధమో ఇది
విడరాని అనుబంధమైనది
అనురాగము పంచుతూ
అభిమానము పెంచుతూ
ఒక దేవతగా నిలిచింది
ఏ భావ చిత్రమో ఇది
నా జతన చేరింది
వెలుగులు చిమ్ముతూ
వలపులు చిందుతూ
ఎదలో మధురిమ నింపింది //మాటలురాని//

చరణం 2:
---------
అతడు:
బీడువారిన ఎడారిలో
పూవులవానే కురిసింది
చితికిపోయిన చీకటి బ్రతుకులో
కొత్తవెలుగులా వచ్చింది
ఊహించని ఆశల పల్లకి
ఎదురుగ నిలబడి పిలిచింది

ఆమె:
ఆగిపోయిన మూగ భాషకు
అక్షరమొదిగిన శిల్పివి నీవు
నేల రాలిన పూలతీగకు
ప్రాణం పోసిన మాలివి నీవు //మాటలురాని//

Friday, October 21, 2011

ఎడారి పుష్పం

ఎడారిలో పూచిన పూవును నేను
పొదరింటికై వేచిన తీవెను నేను
పెనుతుఫానులో చిక్కిన నావను నేను
తీరం కనరాక నడి సంద్రాన నిలిచి ఉన్నాను //ఎడారిలో//

ఎవరో ఒకరు ఎపుడో అపుడు
ఈదారిలో వచ్చి నను చేరదీసి
తనదానిగా చేసుకుంటాడని
ఈచెరనుండి నన్ను విడిపిస్తాడని
ఎదను పరచి ఎదురు చూస్తు
మథనపడే కోయిల నేను
వసంతానికై వేచి ఉన్నాను //ఎడారిలో//

నా రాజు ఈరోజు వచ్చాడని
నన్నెంతో మెచ్చి నాకే మనసిచ్చి
తనతో తీసుకెళతాడని
నా తోడు నీడగా ఉంటాడని
కనులు మూసి కలలు కంటు
నిదురించే రేయిని నేను
ఉదయానికై వేచి ఉన్నాను //ఎడారిలో//

Tuesday, October 18, 2011

నీవే నేనంటా

నీవంటే నేనంటా
నీవెంటే నేనుంటా
నీ కంటి పాపను నేనై
కలలెన్నో కంటూ ఉంటా //నీవంటే//

నీ ఊపిరి నేనంటా
నీ ఊహను నేనంటా
నీ మాటలలో నేనుంటా
నీ మౌనంలో నేనే ఉంటా
నీ పెదవులపై వెన్నెల నేనై
తళతళమని వెలుగుతు ఉంటా
నీ చెక్కిలిపై సిగ్గును నేనై
కితకితలే పెడుతూ ఉంటా //నీవంటే//

నీ తలపే నేనంటా
నీ వలపే నేనంటా
నీ జతలో నేనుంటా
నీ వెతలో నీతోనే ఉంటా
నీ పాటలో మాటలు నేనై
సరిగమలే పలుకుతు ఉంటా
నీ బాటలో అడుగులు నేనై
కడదాకా తోడుగ ఉంటా //నీవంటే//

Monday, October 17, 2011

సాగర తీరంలో

సాగర తీరంలో సంధ్యారాగంలో
ఎగసిపడే చిలిపి అలల
మోహన మురళీ గానం
మనసుపడే చెలియ కనుల
మెరిసే వలపు గాలం //సాగర తీరంలో//

మలి సంధ్య మలుపుల్లో
చెలిపెదవి విరుపుల్లో
చిరుగాలి ఊపుల్లో
చలివాడి విసురుల్లో -
కబుర్లాడుకోనీ..
రెండు తేనె మనసులు
పెనవేసుకోనీ..
రెండు కోడె వయసులు
నులివెచ్చని బిగి కౌగిట
సేద దీరుకోనీ..
రెండు ప్రేమ పావురాలు //సాగర తీరంలో//

తుళ్లిపడే సాగర కెరటాలు
చల్లబడెను తీరం చేరి
అదిరిపడే చెలి అధరాలు
కుదుట పడెను మోహం తీరి -
నెమరువేసుకోనీ..
గడచిన తీపి జ్ఞాపకాలు
ఎదను పరచుకోనీ..
గడిపిన మధుర క్షణాలు
చిరుచెమటల తడి సందిట
తిరిగి రాసుకోనీ..
వలపు ప్రేమ పాఠాలు //సాగర తీరంలో//

Tuesday, October 11, 2011

పల్లె రోదన

రతనాల మా పల్లె నేడు
రాళ్లగుట్టగా మారింది చూడు
సిరులు పండినా మాగాణి నాడు
కరువు కోరల్లో చిక్కింది చూడు
చేయూతనిచ్చే నాథుడే లేడు
ఎవరు వింటారయ్య ఈ రైతన్న గోడు //రతనాల//

అప్పొ సప్పో చేసి పెట్టుబడులే పెట్టి
పంట చేతికి రాక పడరాని పాట్లు పడి
అప్పు తీర్చాలేకా మింగమెతుకూ కనక
ఇల్లు నడపా లేక పిల్లలను పోషించ లేక
భవిత కానారాక భిక్షమెత్తాలేక
పురుగుమందే పదిలమనుకొని
ప్రాణాలు వదిలేను పాపము రైతన్న //రతనాల//

పుచ్చిపోయిన విత్తనాలు
పెరిగిపోయే ఎరువు ధరలు
కూలబడిన కాడి ఎద్దులు
ఇంకిపోయిన తోట బావులు
విద్యుత్తులేని కరెంటు తీగలు
మద్దతే కరవైన ప్రభుత్వ రీతులు
గుండె చప్పుడు ఆగిపోయి
చావుడప్పులు మోగుతుంటే
చేలు చేసే మూగ రోదన
చెవిన పడెనా ఎవరికైనా? //రతనాల//

Monday, October 10, 2011

పల్లె ఏడుస్తున్నాది

పల్లె తల్లడిల్లుతున్నాది
నా పల్లె గొల్లుమంటున్నాది
పల్లెలోని ఇల్లు ఇల్లూ
బతుకుజీవుడాయని ఏడుస్తున్నాది //పల్లె//

పచ్చగ ఉన్న పొలాలన్నీ
ఏడారిలా ఎండిపోయె
వానసినుకు నేలరాలక
భూములన్నీ బీడులాయె
తిండిగింజలే కానరాక
గంజినీళ్లే కరువాయె
రోగమొచ్చి మంచానపడితే
మందు మాకూ లేకపోయె
కళకళలాడిన ఊరంతా
వల్లకాడుగ మారిపోయె //పల్లె//

గుండెనిండా నిండుకున్న
బాధలే మా చుట్టాలాయె
ఎదురుచూపులకు బదులుగా
మాకుమిగిలేది కన్నీళ్లేగా
పల్లె కన్నీరు పెడుతూఉంటే
దేశమేగతి బాగుపడునురా
తల్లిపాలే ఇంకిపోతే
పిల్లలేరీతి ఎదుగునురా
ఇకనైనా కళ్లు తెరచి
పల్లెను బతికించుకుందామురా
మన పల్లెలను బతికించుకుందామురా//పల్లె//

Monday, September 26, 2011

హేయ్‌ బ్యూటీ

(ఈ మధ్య వస్తున్న సినిమా పాటల ట్రెండుకనుగుణంగా ఒక చిన్న ప్రయత్నం చేశాను..ఈ కింది పాటలో..ఎలా ఉందో చెప్పండి)

హేయ్‌ బ్యూటీ...
జర ముడ్‌ కే దేఖో పీఛే
నా మాటే...
జర బోల్‌ నేదో తుంసే
నీ అందమే నను చుట్టేసిందే
అది బంధమై నను కట్టేసిందే
నిన్నిక వదలనే నన్నెంతగా తిట్టినా
తుంసే ప్యార్‌ హై సనం నీమీదొట్టుగా //హేయ్‌ బ్యూటీ...//

ఆగే ఆగే నువు పోతూ ఉంటే
పీఛే పీఛే నేవస్తూ ఉంటే
చూసేవాళ్లేమనుకుంటారే
నీ పరుగు ఆపి నాతో వస్తే
నాకున్నదంత నీకే ఇస్తానే
ఆవో సాథ్‌ సాథ్‌ జీయేంగే
సాథ్‌ మిల్‌ కే ఘూమేంగే
చచ్చే దాక చెయ్యి వదలనే
నువ్వొచ్చేదాకా పట్టు వీడనే //హేయ్‌ బ్యూటీ...//

ఇన్నాళ్లు తిరిగానే అవారాగా
నీ ప్రేమ లో పడిపోయానే దీవానాగా
నువు కాదంటే ఐపోతానే పాగల్‌ గానిగా
నీ అందానికే లేదే పోటీ
ఈ పోకిరిగానికి లేదే సాటి
మేరీ బాత్‌ సున్‌ లో పోరీ
తిరుగులేనిదే హం దోనోంకా జోడీ
ఇంకా ఎందుకే ఆ బింకం
వదిలిపెట్టవే నీ పంతం //హేయ్‌ బ్యూటీ...//

నిన్నే చూస్తున్నా(Revised)

పల్లవి:
నిన్నే చూస్తున్నా
నీవెంటే వస్తున్నా
నీ ఊహలలో...
నీ ఊపిరిలో...
పాగా వేస్తున్నా...
నిన్నే చూస్తున్నా...
నిన్నే చూస్తున్నా.....//నిన్నే చూస్తున్నా//

చరణం 1:
నాకిది కొత్తగా ఉన్నా
నీకది వింతగా తోస్తున్నా
నీతోనే నేననుకున్నా
నీతోనే నే కలగన్నా
ఎదలో వలపును రగిలించీ
ఏమీ పట్టనట్టు వెళుతున్నావు
నీకిది న్యాయమా..ప్రియతమా...//నిన్నే చూస్తున్నా//

చరణం 2:
నీ ప్రేమే నాదనుకున్నా
నా బ్రతుకే నీదనుకున్నా
నీ శ్వాసే నాప్రాణమనీ
నీ ధ్యాసే నా లోకమనీ
కలలెన్నో కన్నాను
కాలాన్నే మరచాను
నా దరి చేరవా.. ప్రియతమా...//నిన్నే చూస్తున్నా//

రంగుల కల

పల్లవి:
రంగుల కలలో..
ఊహల వలలో..
విహరించే చెలీ
ఆశల ఒడిలో..
వేదన జడిలో..
నిదురించే సఖీ
కనులు తెరచి ఇటు చూడొకసారి
నీ ఎదుట నిలిచింది నిజం విసిగి వేసారి //రంగుల కలలో//

చరణం 1:
ఆకాశమే అందుకోవాలని
తారలనే చేరుకోవాలని
వెన్నెలనే కోసుకోవాలని
ఆశపడిన ఓ చిలకమ్మా
నేలకు దిగి రావమ్మా
నిజమేదో తెలుసుకోవమ్మా... //రంగుల కలలో//

చరణం 2:
ఇంద్ర ధనసుపై నడవాలని
మేఘాలతో ఆడుకోవాలని
స్వర్గానికి వంతెన వేయాలని
కలలు కన్న ఓ చిట్టెమ్మా
నిదుర వీడి లేవమ్మా
చుట్టూ ఓసారి చూసుకోవమ్మా... //రంగుల కలలో//

Monday, September 19, 2011

సినిమా జీవితం

సినిమా సినిమా సినిమా
చూడర బాబూ సినిమా
సినిమా లేని జీవితం
బ్రతకడమే నిరర్థకం
నీలో ఉన్న బాధలన్నీ
ఒక సినిమా చూస్తే మటుమాయం //సినిమా సినిమా//

రోజంతా కష్టపడి
సాయంత్రం సినిమాకొస్తే
ఒంట్లోని నీరసమంతా
చిటికెలో అదృశ్యం
నిద్రలో నీ కలలన్నీ
కళ్లముందే సాక్షాత్కారం
సినిమా హాల్లో మూడుగంటలూ
నువ్వే హీరో రెచ్చిపో
కాసేపైనా ఊరటనిచ్చే
సినిమాయే నీ నేస్తమురా
చిరాకులన్నీ దూరం చేసే
మహామంత్రమే సినిమారా//సినిమా సినిమా//

నీ చుట్టూ జరిగేదే
సినిమా నీకు చూపిస్తుంది
సినిమాలో నువు చూసేదే
నీ చుట్టూ తిరుగుతు ఉంది
సినిమాయేరా జీవితం
మనలో కొందరికీ
సినిమాలు చూడందే
నిదుర రాదు ఎంతోమందికి
సినిమా హీరోలే వీళ్లకు
కనిపించే దైవాలూ
వారి కోసం ఏమైనా
చేస్తారులే అభిమానులు//సినిమా సినిమా//

Friday, September 16, 2011

నిన్నే చూస్తున్నా

పల్లవి:
నిన్నే చూస్తున్నా
నీవెంటే వస్తున్నా
నీ ఊహలలో...
నీ ఊపిరిలో...
పాగా వేస్తున్నా...
నిన్నే చూస్తున్నా..... //నిన్నే చూస్తున్నా//

చరణం 1:
నాకేదో కొత్తగా ఉన్నా
నీకేమీ తెలియనట్టున్నా
నీతోనే నేననుకున్నా
నీతోనే నే కలగన్నా
ఎదలో అగ్గి రాజేసి
ఏమీ ఎరగనట్టు వెళుతున్నావు
నీకిది న్యాయమా..ప్రియతమా...//నిన్నే చూస్తున్నా//

చరణం 2:
నీ ప్రేమే నాదనుకున్నా
బ్రతుకే నీకు దాసోహమన్నా
నీ శ్వాసే నాప్రాణమనుకున్నా
నీ ధ్యాసే నా లోకమనుకున్నా
పరువాన్నే ఉసిగొలిపావు
నా హృదయాన్నే తట్టి లేపావు
నా ఆవేదనా ..తీర్చవా..//నిన్నే చూస్తున్నా//

Wednesday, September 14, 2011

జోజో లాలీ..జోజో లాలీ..

పల్లవి:
జోజో లాలీ జోజో లాలీ
ఆదమరచీ నువు నిదురపోవాలీ
ఆ నిదురలో తీయనీ
కలలే....కనాలీ
జోజో లాలీ జోజో లాలీ //జోజో లాలీ//

చరణం 1:
నీ బోసినవ్వులే మాకు
మణులూ మాణిక్యాలు
నీ చిలిపి కేరింతలే మాకు
ఆ దేవుడిచ్చిన వరాలు
బుడి బుడి నీ నడకలే మాకు
హాయి గొలుపు వేడుకలు
రోజంతా ఆడి నీవు అలసిపోయావురా కన్నా
ఇకనైన నిదురించి నీ అలుపు తీర్చుకోర నాన్న
మా చిట్టి పాపా..మా గారాల పట్టీ//జోజో లాలీ//

చరణం 2:
ఏ జన్మ సుకృతమో
మా ఇంట వెలిశావు
ఏ నోముల ఫలమో
మా కంటి పాపవైనావు
సేదతీరా నిదురపో
నీ కలతలన్నీ మరచిపో
నీ రాకతో నిండెనమ్మ మా లోగిలిలో వెలుగులు
నీ నవ్వుతో పండెనమ్మ మేము కన్న కలలు
ఓ ముద్దుల తల్లీ..మా కల్పవల్లీ//జోజో లాలీ//

Monday, September 12, 2011

నిన్నా మొన్నా లేనిది ఏదో

నిన్నా మొన్నా లేనిది ఏదో
నేడే నాలో మొదలయ్యింది
పగలూ రాత్రీ తేడా తెలియక
నిన్నే కలవరిస్తోంది
అది ఏమిటో ప్రియా... తెలుపవా
నీమదిలో నన్నే ...నిలుపవా //నిన్నా మొన్నా//

నిను ఏ క్షణమైతే చూశానో
నన్ను నేనే మరిచానూ
నీ ఊహలలో తేలిపోతూ
నా ఉనికిని ఎపుడో వదిలేశాను
నన్ను నీలో చూసుకుంటూ
జీవితమంతా గడిపేస్తాను
నీతోనే పయనిస్తూ
వెయ్యేళ్లైనా బ్రతికేస్తాను//నిన్నా మొన్నా//

నీ చుట్టూ ఇంత జరిగినా
అసలేమీ పట్టదా నీకు
నను కట్టేసిన నీమనసునకు
వినిపించదా నా పిలుపు
ఇంత కఠినమా నీ హృదయం
ఉలుకూ పలుకు లేనే లేదు
ఒక్కసారి తొంగి చూడు
నీ ఎదలోనే ఒదిగున్నా నేను //నిన్నా మొన్నా//

Sunday, September 4, 2011

గురువే దైవం


సాకీ:
గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః
గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్‌ పరబ్రహ్మ
తస్మైశ్రీ గురవేనమః

పల్లవి:
నీ జ్ఞానానికి మూలం
నీ ధ్యానానికి మూలం
నీ మంత్రానికి మూలం
నీ ముక్తికి మార్గం గురువే కదా...
గురువంటే దైవం
గురువంటే విశ్వం
గురువంటే సమస్తం
ఆ గురువుకు చేయాలి
ప్రతి ఉదయం నమస్కారం... //నీ జ్ఞానానికి//

చరణం 1:
మాతృదేవోభవ...
పితృదేవోభవ...
ఆచార్య దేవోభవ...
గురువంటే నీ మాతాపితలతో సమానం
అందుకే సేవించాలి ఆయనను అనుదినం
నీకూ ఆ దేవునికి మథ్య ఉన్న
వారథియేరా గురువు
గురువు మాట వినకుంటే
లేదు నీకు బ్రతుకు తెరువు...
తల్లీ తండ్రీ గురువూ..
నీకు కనిపించే దైవాలు
వారిని పూజించిన చాలు
ఆదేవుని కరుణ నీపై వాలు... //నీ జ్ఞానానికి//

చరణం 2:
గురువంటే జ్ఞానం
గురువంటే యోగం
గురువంటే యజ్ఞం...
ఆ గురువు నీకు చూపించే మార్గము
ఇహపరాన దక్కించును సౌఖ్యము
మంచేదో చెడు ఏదో
నీకు తెలిపేది గురువూ..
మంచి మార్గాన
నిన్ను నడిపేది గురువూ..
నీకూ గురువుకు ఉన్న బంధము
అది ఒక అద్వితీయ అనుబంధము
ఆ అనుబంధానికి మించి లేదు
మరి ఏ పవిత్ర సంబంధము //నీ జ్ఞానానికి//

Thursday, September 1, 2011

సంగమం


సంగమం.. రాగాంగ సంయోగం
రాగానురాగాల సంధానం
ఇది నా హృదయము అర్పించు
సుమగాన సంకీర్తనం //సంగమం//

కన్నీటి కెరటాలు అలలైసాగగ
మంజీర నాదాలు ఝరులై పారగ
మదిలో దాగిన అక్షర మాలలు
వెల్లువలై పొంగిన వేళ
మూగబోయిన అందెల రవళులు
దిగంతాలను తాకిన వేళ
ప్రకృతిలోని ప్రతి పిలుపూ
ప్రణవ రాగమై వినిపించిన వేళ//సంగమం//

సంక్షిప్త భంగిమలు జతులై ఆడగ
సంక్లిష్ట భావాలు కృతులై పాడగ
శిథిలమైన శిశిర వనములు
కొత్త చిగురులే తొడిగిన వేళ
చేదుగ మిగిలిన జీవన స్మృతులు
మధుర స్మరణలై చేరిన వేళ
తనువులోని అణువణువూ
విరిబాలలై కుసుమించిన వేళ//సంగమం//

Saturday, August 27, 2011

జీవితమొక సంగ్రామం


(విధి వక్రించి యాక్సిడెంట్స్‌ లో వెన్నెముక విరగ్గొట్టుకొని వీల్‌ చైరుకు పరిమితమైన కొంతమంది అభాగ్యులు మొక్కవోని ధైర్యంతో పాడుకుంటున్న పాట..)

జీవితమొక చెలగాటం
అంతులేని పోరాటం
ఆశ నిరాశలమధ్య సాగే సంగ్రామం
వెన్ను విరిగినా కన్ను చెదిరినా
అంతిమ విజయం మాదేలే
అపజయమన్నది లేనే లేదులే //జీవితమొక//

కాళ్లు చచ్చిపోయినా
మా చేవ చావ లేదులే
వెన్నెముక విరిగిపోయినా
మా ధైర్యం కరగ లేదులే
ఆశే ఊపిరిగా
ఆశయమే బాసటగా
ముందుకు సాగిపోతాములే..
విధి వక్రించినా
కాలం వెక్కిరించినా
ఊపిరి ఉన్నంత వరకు పోరాడేములే
ఆశల సౌధాలను చేరుకుంటాములే //జీవితమొక//

నడవలేక పోయినా
మా ఆలోచన ఉరికేనులే
నిలబడలేక పోయినా
మా నమ్మకం సడల లేదులే
ఒకరికి స్ఫూర్తిగా
ఇంకొకరికి ప్రేరణగా
రేపటిలోకి పయనించేములే..
కష్టాలెన్నెదురైనా
కలతలెన్ని పలకరించినా
అకుంఠిత దీక్షతో బ్రతికేములే
బ్రతుకంటే అర్థం చెబుతాములే //జీవితమొక//

Wednesday, July 13, 2011

ప్రేమ రాగం


ఏదో ఏదో నా హృదయం
పలికిందొక రాగం
ప్రేమో ఏమో నా మదిలో
విరిసిందొక భావం
నా మనసే పాడిందీ
నీ వైపే నడిచిందీ
నిను విడిచీ పోలేకా
నీ చెంతనె నిలిచిందీ //ఏదో ఏదో//


ఆశలు ఊహల పల్లకిలో
ఊరేగే ఊరంతా
నీ నీడల జాడలలో
తిరిగేనే రోజంతా
నా బ్రతుకే నీవెంటా
నా ప్రాణం నీదంటా
కొండాకోనా గుసగుసలాడే
నీదీ నాదీ ప్రేమంటా //ఏదో ఏదో//


కోయిల పాడే పాటలలో
నీ పిలుపే వినిపించే
కిలకిలనవ్వే చిలుకల్లే
నాతోనే పయనించే
నీ మాటే నాదంటా
నా మనసే నీదంటా
ఎదలోగుడిగంటలు మ్రోగే
నీకూ నాకూ పెళ్లంటా //ఏదో ఏదో//

Friday, July 1, 2011

నీ రాక ముందుగ తెలుపర స్వామీ


నీ రాక ముందుగ తెలుపర స్వామీ
నీ పూజకు తేవాలి పూలూ ఫలములు
ఆకలిగొని నీవిట అడుగిడితే
నేనేమి చేతురా నీ ఆకలి తీర్చగ //నీ రాక//

జీవితమంతా నీ దర్శనానికై
ఎదురు చూస్తూ నిలిచానూ
వీచే గాలుల సవ్వడి వినబడి
నీవువచ్చే అలికిడి అనుకొని
ఉదుటున పరుగిడి చూశాను
నిను గాంచ లేకున్నా...నీ..
అడుగుల గురుతులే చాలునురా
ఈ జన్మ కదే భాగ్యమురా //నీ రాక//

ప్రతి దినము నీ పాదసేవకై
ఏరి కూరిన పూలమాలలు
నీకై వేచి వగచి వాడెనురా
నీ సుందరవదనము చూడాలని
నీ చరణారవిందములు తాకాలని
గంపెడాశతో బ్రతికేనురా..
ఒక క్షణమైనా నిను చూసీ
ఈ ప్రాణము విడిచిన చాలునురా //నీ రాక//

Monday, June 20, 2011

ఎవరమ్మా నీవెవరమ్మా


బాపూ బొమ్మవా
శ్రీ శ్రీ కవితవా
పరిమళాలు వెదజల్లే
అన్నమయ్య కీర్తనవా
నా మనసే దోచుకున్న
కృష్ణశాస్త్రి గీతికవా
ఎవరమ్మా నీవెవరమ్మా...//బాపూ బొమ్మవా//

మల్లెల తోటలో విరబూసిన
సన్నజాజి తీగవా
ఊరు చివర కొలనులో అరవిచ్చిన
ఎర్రకలువ పూవువా
ఆమని కోయిల తీయగ పాడే
మధురమైన పాటవా..
గలగల పారే సెలయేటి సవ్వడివా..
ఎవరమ్మా నీవెవరమ్మా..//బాపూ బొమ్మవా//

సాయంత్రం వేళలో మెల్లగ వీచే
చల్లని పిల్ల గాలివా
వేసవివేడిలో హాయిగ కురిసే
తొలకరి చిరుజల్లువా
హేమంత ఋతువులో వేడిని రగిలించే
నులివెచ్చని కౌగిలివా..
రవివర్మ చిత్రించిన రంగుల కలవా..
ఎవరమ్మా నీవెవరమ్మా.. //బాపూ బొమ్మవా//

Friday, June 17, 2011

వర్షంతో స్నేహం


వానా వానా వానా
నా చెంప నిమిరి పోవమ్మా
చిననాటి నేస్తం లేకున్నా
నీ తోడే నాకు చాలమ్మా
నేనేడ్చిన ప్రతిసారీ
నువ్వు నన్ను చేరాలమ్మా
నా కన్నీరెవరికి కనపడకుండా
తుడిచి వెళ్లి పోవాలమ్మా //వానా వానా//

దూరమైన చిననాటి స్నేహం
మళ్లీ చిగురించేనా
ఇన్నాళ్లకు కలిసిన నేస్తం
తిరిగి దూరమయ్యేనా
ఎలా మరచిపోనమ్మా మా నేస్తాన్నీ
ఎలా చంపుకోనమ్మా ఈ స్నేహాన్నీ
మా మథ్యన మిగిలిందొక
పెను అగాథమేనా..
విథి రాసిన రాతలో
మాదొక వింత కథయేనా.. //వానా వానా//

ఒక బండరాయిలా నేను
పైకి కనిపిస్తున్నా
లోలోన వర్షించే
కారు మబ్బులా ఉన్నా
తీరమెంత శాంతమైనా
కడలి అలలు దాగేనా
నాలో రేగే అలజడిని
ఈ అలలు మింగగలిగేనా
ఈ వర్షం వెలిసే లోగా
మనసారా ఏడవగలనా... //వానా వానా//

Tuesday, April 12, 2011

రామా నిన్నే నమ్మితిమయ్యా


శ్రీ రఘు రామా సీతారామా
నీ నామ స్మరణే మధురమయా
నీ పాద సేవే మా సౌభాగ్యమయా//శ్రీ రఘు రామా//

కౌసల్య తనయా కోదండ రామా
కైవల్య పద దాత కౌస్తుభ రామా
నీ కర కమలములే...
దీవెనలొసగే దివ్యశయములయా
నీ శుభ చరణములే...
ముక్తిని చూపే పరమ పాదములయా
నీ నామ కీర్తనలే...
భవ సాగరమును దాటించు సుమ తరణములయా//శ్రీ రఘు రామా//

నిరతము నిన్నే కొలిచెదమయ్యా
మదిలో నిన్నే నిలిపెదమయ్యా
నీ చిరునవ్వే మాకు చాలునయ
నీ కరుణ మాపై కురిపించవయా
నీ దాసుల మొర ఆలకించవయ
నీ పాదాల చెంత చేరనీయవయా
నీ కీర్తి వేనోళ్ల పాడెదమయ్య
మా హృదయములో నిత్యము నిదురించవయా//శ్రీ రఘు రామా//

Wednesday, April 6, 2011

జయమ్ము నిశ్చయమ్మురా..

ఓటమితో ధైర్యము వీడకు
నిరాశతో దిగాలు పడకు
కన్నీళ్లతో కాలం గడపకురా...
నిన్న నీది కాదనుకుంటే నేడు నీదే ఔనురా
నేడు కలసి రాకుంటే రేపు ఉండనే ఉందిరా
నమ్మకమే శ్రీరామ రక్షరా
ధైర్యంగా ముందుకు పోతే
గెలుపే నీ పక్షమురా //ఓటమితో//

తప్పటడుగులు వేస్తూనే
నడక నువ్వు నేర్చుకోరా
పెను తుఫానులెదురైనా
నీ గమ్యం చేరుకోరా
కన్నీళ్లెంతగ కార్చినా
కడుపు నీది నిండదురా
ఎదురు దెబ్బలే నీకు
బ్రతుకు నేర్పు పాఠమురా
రాళ్ళువిసిరే వాళ్ళకు
అందనత ఎదగాలిరా
వేలెత్తి చూపినవాళ్ళే
జేజేలు పలకాలిరా //ఓటమితో//

గ్రహణం పట్టిన సూర్యుడు
తిరిగి వెలుగు చిమ్మునురా
మబ్బు పట్టిన చంద్రుడు
మరల వెన్నెల కురియునురా
తెలియక పొరపాటు జరిగితే
జీవితాంతము వగచకురా
తప్పులు సరిదిద్దుకుంటూ
ముందుకు సాగి పోవాలిరా
చిమ్మచీకటి చీల్చుకుంటూ
వెలుగురేఖలు వచ్చునురా
కల్లోలమైన సముద్రమే
గజ ఈతను నేర్పునురా //ఓటమితో//

Thursday, March 31, 2011

నన్ను ప్రేమించొద్దు


వద్దు వద్దు వద్దు
నన్ను ప్రేమించొద్దు
వద్దు వద్దు వద్దు
నాతో మాటాడొద్దు //వద్దు వద్దు//

దొంగ చాటుగా గోడ దూకి
నన్ను కలవద్దు
కిటికీలోంచి సైగలు చేస్తూ
నన్ను పిలవొద్దు
దూరం నుంచే ఎగిరే ముద్దు
నాకు ఇవ్వద్దు
మారువేషంలో నాగదికొచ్చి
అల్లరి పెట్టొద్దు
తియ్యతియ్యని కబుర్లన్నీ
నాకు చెప్పొద్దు //వద్దు వద్దు//

ఫ్రెండునంటూ గొంతు మార్చి
ఫోన్లు చెయ్యొద్దు
ప్రేమలేఖలు తమ్ముడిచేత
అసలే పంపొద్దు
ప్రతి ఉదయం సందుచివర
కాపల కాయొద్దు
సాయంత్రం చెరువుగట్టున
ఎదురు చూడొద్దు
నన్ను కలిసిన ప్రతిసారీ
తీయని ముద్దు ఇవ్వనే ఇవ్వద్దు//వద్దు వద్దు//

Friday, March 25, 2011

స్నేహ గీతం


స్నేహమా నేస్తమా
చెంతకే చేరవా
ప్రాణమా దైవమా
చింతలే తీర్చవా
నీ చెలిమి లేకుంటే
నువు తోడు రాకుంటే
బ్రతుకు చితికి పోవు కదా
చితికి చేరి పోను కథా //స్నేహమా//

బ్రతుకంతా విషాదమై
ముందు వెనుక అగాధమై
నేనే నాకు భారమై
జీవితమే నేరమై
పెనుతుఫానులో చిక్కిన వేళ
మండుటెండలో నడిచే వేళ
అమావాస్య వెన్నెలవై
గాయాలకు లేపనమై
నన్ను చేరదీశావూ
నాతో చేయి కలిపావూ //స్నేహమా//

కలలే రాని కన్నుల్లో
తీపి కథలు నిలిపావూ
ఆశే లేని గుండెల్లో
కొత్త వెలుగు నింపావూ
మన స్నేహం మరపురానిది
నీ సాయం తీర్చలేనిది
నీతో గడిపిన క్షణాలే
నిలిచెను చెరగని జ్ఞాపకాలై
నీకై వేచిన నిముషాలే
పలకరించెను మధురస్మృతులై //స్నేహమా//

Wednesday, March 23, 2011

తెలుగు బాల


ఓ తెలుగు బాలా ఇలా చూడవేలా
నీ కట్టూ బొట్టూ నాకు నచ్చిందే చాలా
ఓ అందాల బొమ్మా ఇటు రావేలనమ్మా
నీ నడకా కులుకూ నాకు నచ్చిందే కొమ్మా //ఓ తెలుగు బాలా//

నీ పట్టు ఓణీ చూసీ
మనసే పారేసీ
నీ చుట్టూ తిరిగానమ్మా ఓ అలివేణీ
నీ వాలుజడనే చూసీ
నిదురే మానేసీ
నీ కలలే కన్నానమ్మా ఓ విరిబోణీ
నీ అడుగులు చేసే అలికిడిలో
నీ మువ్వలు చేసే సవ్వడిలో
రాగాలెన్నో విన్నానమ్మా ఓ కలకంఠీ
ఈ జన్మకు నువ్వే చాలమ్మా
నా ప్రాణం నీదే లేవమ్మా
నువు లేని బ్రతుకే వద్దమ్మా
నీ కోసం ఆదేవుడినైనా ఎదిరిస్తానమ్మా //ఓ తెలుగు బాలా//

నీ కందిరీగ నడుమే చూసీ
మదిలో గుబులేసీ
నీ వెనకే నడిచానమ్మా ఓ యువరాణీ
నీ కలువ రేకుల కనులే చూసీ
నన్ను నేనే మరచీ
నీ ధ్యానమే చేశానమ్మా ఓ గజగామీ
నీ చూపులు విసిరిన భాషలలో
నీ జడలో తురిమిన మల్లెలలో
నవ్వులు ఎన్నో చూశానమ్మా ఓ మధువాణీ
నువ్వాదేవుడిచ్చిన వరమమ్మా
నువు పక్కన వుంటే చాలమ్మా
ఇంకేమీ నాకు వద్దమ్మా
నీకోసం ఎన్నాళ్ళైనా వేచి వుంటానమ్మా //ఓ తెలుగు బాలా//

Sunday, March 20, 2011

నాన్న

నాన్నంటే మాకు ఎంతో గురి
నాన్న మాటంటే మాకు పంచాక్షరి
నాన్న అడుగు జాడలే
మాకు చూపాయి దారి
ఆ దారే నేర్పింది మాకు
ఎలా ఈదాలో జీవన గోదారి //నాన్నంటే//

రేయనకా పగలనకా కష్టపడి
ఇంటిబండి లాగుతాడు నాన్న
ఆలనతో పాలనతో లాలించి
కన్న బిడ్డలను పెంచుతాడు నాన్న
తప్పు చేయవద్దంటూ
బుద్ధిగా వుండమంటు
గద్దించి చెబుతాడు నాన్న
కంటిచూపుతో బెదిరించి
మనసులోనె దాస్తాడు ప్రేమ
పైపైన చూపుతాడు గాంభీర్యం
లోలోన చిలుకుతాడు వెన్నసముద్రం //నాన్నంటే//

వేదాలెంత చదివినా
పురాణాలెన్ని వెతికినా
నీకు కనిపించని మార్గం చూపేది నాన్న
నీ వెన్నుతట్టి ముందుకు నడిపేది నాన్న
నీ వెంటే ఉంటూ
నీ గమనం కంటూ
నీ విజయాన్ని కోరేది నాన్న
నాన్నంటే నీ హితుడు
నాన్నంటే స్నేహితుడు
నాన్నంటే సాక్షాత్తు
ఆ భగవత్‌ స్వరూపుడు //నాన్నంటే//

Thursday, March 17, 2011

కర్తవ్యం

ప్రేమించు ప్రేమించు
దేశాన్ని ప్రేమించు
మంచితనము పెంచు
మానవతను పంచు //ప్రేమించు//

ఒకరినొకరు చంపుకొనే
నీతిని ఖండించు
అందరూ నా వారను
భావన కలిగించు
మనసులు ఒకటయితే
మతములేల విభజించు
అసూయా ద్వేషాలను
మొక్కలోనె తుంచు
చేయి చేయి కలుపు
ప్రగతిని సాధించు
చెమటోడ్చి పనిచేసి
రతనాలను పండించు
అందరికీ సరిపడా
పాడిపంటలందించు //ప్రేమించు//

ఇరుగు పొరుగువారితో
ప్రేమతో వ్యవహరించు
ఎంత ఎత్తు ఎదిగినా
వినయంతో పలకరించు
ప్రగల్బాలు మానుకొని
చెప్పింది చేసి చూపించు
ఆపదలో ఉన్న వారిని
కరుణతో ఆదరించు
స్వార్ధాన్ని చంపుకొని
దేశభక్తి పెంపొందించు
అలసత్వం వదిలిపెట్టి
ముందుకు పయనించు
ప్రపంచాభివృద్ధిలో
దేశాన్ని ముందుంచు //ప్రేమించు//

Wednesday, March 16, 2011

కన్నీటి జోల

జోజో హాయీ జోజో హాయీ
నిద్దుర పోరా ముద్దుల పాపాయీ - 2
నీకు జోలపాట పాడనా
లాలిపాట పాడనా
కురిసే నా కన్నులతో
కన్నీటిపాట పాడనా //జోజో హాయీ//

కౌసల్యను కానురా
నీకు రతనాల లాలి పోయ
యశోదను కానురా
నీకు పాలవెన్నముద్దలీయ
పార్వతిని కానురా
నీకు మురిపాల ముద్దులీయ
ఈ అమ్మ పాడలేదురా
నీకు జోలపాట
నిను జోకొట్టలేదురా
ఈ జాలిపాటా //జోజో హాయీ//

పక్షినైనా కానురా
నిను గూటిలో పవళింపసేయ
చెట్టునైనా కానురా
నిను నీడలో నిదురింపసేయ
మట్టినైనా కానురా
నినుపొత్తిళ్లలో శయనింపసేయ
ఈ అమ్మ ఒడే పానుపుగా
ఆదమరచీ నిదురపో
ఈ కంటి తడే లాలనగా
సేదతీరీ పరుండిపో //జోజో హాయీ//

Wednesday, March 9, 2011

ది లీడర్‌

వస్తున్నాడొస్తున్నాడొస్తున్నాడు
ప్రజానాయకుడొస్తున్నాడు
అగ్నికణంలా భగ భగ మంటూ
సూర్య కాంతిలా చీకటిని చీల్చుకుంటూ
వస్తున్నాడొస్తున్నాడొస్తున్నాడు
ప్రజానాయకుడొస్తున్నాడు...//వస్తున్నాడు//

అభాగ్యుల కన్నీటి ఆవిరిలో
ఆవిర్భవించీ...
అన్నార్తుల ఆక్రందనల ఘోషలో
ఉద్భవించీ...
మీ వేదనే తన ఆవేదనగా
మీ బాధలే తన వాదనగా
బక్కచిక్కిన బిక్కచచ్చిన
బడుగు బ్రతుకులను ఉద్ధరించాలని...
రోజుకొక్క రంగు మార్చే
పూటకొక్కమాట చెప్పే
మోసగాళ్ళను తుదముట్టించాలని...
జనం లోంచి జనంకోసం
జయజయధ్వానాల మధ్య
శంఖారావమ్ముతో .....//వస్తున్నాడు//

అడుగడుగున జరుగుతున్న దోపిడీని
ఆపాలనీ...
పీడిత ప్రజల గుండెచప్పుడేమిటో
చూపాలనీ...
జనంకోసం తాను నిలబడి
అతనికోసం జనం తిరగబడి
నిలువనీడలేని, కట్టబట్టలేని
అనాధల జీవితాలు చక్కబెట్టాలనీ...
మనుషులంతా ఏకమై
దేశం సస్యశ్యామలమై
విరిసి విలసిల్లాలనీ...
జనప్రభంజనం తోడురాగా
ప్రజల ఆశలనే ఊపిరిగ చేసుకొని
బిగించిన పిడికిలితో.....//వస్తున్నాడు
//

Monday, March 7, 2011

అంతా విష్ణుమయం

అంతా విష్ణు మయమే
ఈ విశ్వమంతా విష్ణు లీలా విన్యాసమే - //అంతా//

వినీల గగనాన విహరించు
నీలిమేఘ వర్ణాలు
సాయంత్రం చల్లగ వీచే
మలయ మారుత పవనాలు
సాగరాన ఎగసిపడే
తరంగాల భీషణ ఘోషలు
మధు మాసం వినిపించే
కోయిల మధుర గానాలు
అంతా ఆ నీలమేఘశ్యాముని
లీలా మాధుర్యమే -//అంతా//

వసంతాన అలరించు
మావిచిగురు జిలుగులు
నిండు పున్నమి వెదజల్లే
పండు వెన్నెల వెలుగులు
గ్రీష్మాన పలకరించు
తొలకరి చిరు చినుకులు
హేమంతాన వేడిగొలుపు
లేలేత రవికిరణాలు
అంతా ఆ గోకులనందుని
క్రీడా విచిత్రమే -//అంతా//

Friday, March 4, 2011

ప్రేయసి

కలలో కనిపించిన తారకవో
ఇలపై దిగివచ్చిన దేవతవో
నా మనసే దోచుకున్న రాధికవో
నా హృదయం పంచుకున్న మేనకవో - //కలలో//

నీ నవ్వుచూసి ఎలకోయిల
పాట నేర్చెనా
నీ నడక చూసి నీలినెమలి
ఆట నేర్చెనా
నీ కులుకు చూసి రాజహంస
ఎగుర నేర్చెనా
చందమామ మోముతో
వెన్నెలమ్మ వెలుగుతో
చుక్కల తళతళలతో
నన్ను కోరి వచ్చిన నా నెచ్చెలీ - //కలలో//

నీ కన్నులలో హరిణాలే
దాగి ఉన్నవా
నీ అధరంలో అమృతాలే
ఊరుతున్నవా
నీ నడుములో నెలవంకలు
కరుగుతున్నవా
నీ మేనులో ముత్యాలే
పొదిగి ఉన్నవా
నీ అడుగులు వినిపించే
సుస్వర రాగాలే
నీ ఎదలయలు పలికించే
సుమధుర గానాలే
నా జీవితాన కురిసే
మల్లెల మకరందాలే - //కలలో//

Thursday, March 3, 2011

అమ్మ

అమ్మా అని పిలిచినా
నీ పలుకే వినపడదే
ఎన్ని రాత్రులేడ్చినా
నీ జాడే కనపడదే
కన్న అమ్మ లేని జన్మ
కలనైనా వలదులే
కనులముందు లేని అమ్మ
కథలాగా మిగిలెనులే //అమ్మా అని//

ఎపుడో చిన్నప్పుడు
నిను చూసిన లేత గురుతులు
కళ్లలో లీలగా
కదిలే తీపి జ్ఞాపకాలు
అందమైన నీ నవ్వూ
చందమామలాంటి మోము
అంత పెద్ద కళ్లూ
ఆ కళ్లనిండ ప్రేమా
జోలపాట పాడావు
లాలి పోసి పెంచావు
కనులుమూసి తెరిచేలోగా
కనుమరుగై పోయావు
ఆ దేవుడికి నువ్వంటే అంత ఇష్టమా
అమ్మలేని బ్రతుకు నాకు ఎంత కష్టమో //అమ్మా అని//


అమ్మా నీవెక్కడ
ఒక్కసారి కనపడవా
నీ ఒడిలో తలవుంచి
నిదురపోనీయవా
నీచేయి అందించిన
గోరుముద్దలేవమ్మా
నా చెంపలు నిమిరిన
అరచేతులు ఏవమ్మా
నాతో మాటాడవా
నీ అక్కున చేర్చుకోవా
గుడిలో దేవత నీవా
బడిలో స్నేహిత నీవా
నువ్వులేని నిజం కల అయినా బాగుండు
కలనైనా నువ్వు కనిపిస్తే బాగుండు //అమ్మా అని//

Saturday, February 19, 2011

గలగల పారే గోదావరి

గలగల పారే గోదావరీ
జలజల సాగే కవితాఝరీ
హృదయంలో ఉప్పొంగే కావ్యలహరి
జీవన రాగంలా ప్రవహించే రసమాధురి
మా కంటి వెలుగు గోదావరి
మా ఇంటి వేల్పు గోదావరి
మా బ్రతుకు తెరువు గోదావరీ…
మా కలత తీర్చు గోదావరీ… - ”గలగల పారే”

త్రయంబకాన బొట్టులా పుట్టి
మహారాష్ట్రలో పరుగులు పెట్టి
అఖండ గోదావరిగ అవతరించి
గౌతమిగా దక్షిణ గంగగా
మనతోటల పాలిట జలనిధిగా
ప్రవహించే గొదావరి
మనలను కరుణించే గొదావరి
కరువు కాటకం కబళించే గోదావరీ…
సిరిసంపదలు కలిగించే గోదావరీ… - “గలగల పారే”

బాసరలో శారదతో ముచ్చటించి
మంజీర నాదంలో తన్మయించి
ప్రాణహిత రాగంతో
ఇంద్రావతి వేగంతో
శబరి సీలేరుల ప్రాభవంతో
తూరుపు కనుమల పాపిట తీసి
రాజమహేంద్రిలో రాజసమొలికి
గౌతమీ వశిష్టలుగా ద్వయమెత్తి
సాగరాన సంగమించు గోదావరీ…
ఉత్తుంగ తరంగ గంగ గోదావరీ … - “గలగల పారే”

Thursday, February 10, 2011

వెన్నెలమ్మ రావే

వెన్నెలమ్మ రావే చల్లనమ్మ రావే
మబ్బెక్కి రావే మంచి కబురు తేవే

చందమామ ఇంటిలోని
వెలుగులన్ని పట్టి తేవే
మాముద్దుల పాపకనులనింపి పోవే

ఆకసాన విహరించే
చుక్కలన్ని చుట్టి తేవే
మాముద్దుల పాపజడనగుచ్చి పోవే

మా పాపాయి బువ్వ తిని
నీతోటి ఆడెనట
పరుగుపరుగునా నువ్వు వచ్చిపోవే

వెన్నెలమ్మ రావే చల్లనమ్మ రావే
మబ్బెక్కి రావే మంచి కబురు తేవే

Monday, February 7, 2011

స్వరోపాసన

నా గానం సామవేద సారం
నా గీతం సప్తస్వర సంయోగం
నా ప్రాణం నందీమృదంగ నాదం
నా దేహం స్వరరాగతాళాల
మేలుకలయికల మధుర గాన గాంధర్వం //నా గానం//

ఎదలోతులలో కదిలే భావం
మోవి పలికించు మురళీ నాదం
కనుపాపలలో వెలిగే దీపం
మది వినిపించు మహతీ గానం
తనువులోని అణువణువు పాడే
వేదనాద స్వర సంప్రదాయం
ప్రకృతి లోని ప్రతి రేణువు తెలిపే
సప్తస్వర సంగీత సుధారసమాధుర్యం
నా జీవనాధార గానామృతం
సంగీత సాహిత్య కళారాధనం //నా గానం//

స్వర తంత్రులలో ఒలికే జీవం
శృతి లయలై నినదించగా
ఆలాపనలో సాగే రాగం
స్వరఝరులై ప్రవహించగా
స్వరమూ స్వరమూ స్వరజతులై
స్వరరాగ సంగతులై ప్రభవించగా
దశవిధ గమకాలు దశదిశల వ్యాపించగా
ఓంకారనాదాలు దిగంతాల ధ్వనియించగా
నా పంచప్రాణాల నిక్వాణ గీతం
సప్తస్వరోపాసనకే అంకితం //నా గానం//

Sunday, February 6, 2011

తొలివలపు

తొలిచూపులోనే నిను నేను వలచా
కడదాక నీతోనే అని నేను తలచా
నీ నీడ నేనై నీ తోడు రానా
నా శ్వాస నీవై నను చేరుకోవా --”తొలిచూపులోనే”

నిను చూసింది మొదలు
చెలరేగింది గుబులు
నీ సొగసు నాలో రేపింది అలలు
నీ వెంట సాగే ఆ పరిమళాలే
నను వెంటాడి నీవైపు లాగే
ఏ వైపు చూసినా నీ రూపమేగా
ఏ నోటవిన్నా నీమాటలేగా
కలయా నిజమా మన ప్రేమ జంట
వరమా కలవరమా మన వలపు పంట -- “తొలిచూపులోనే”

ఏ నాటి ఫలమో ఇది
నా జతన చేరింది
నా బ్రతుకులోన ఆశలు పూసింది
జఢమైన నా చిలిపి కోరికలే
ప్రేమజడివానలో తడిసి విరిసేనులే
నీ తోడులేక నేను సగమే కదా
నీ జంట చేరితే పరిపూర్ణమౌతానుగా
చెలివో నెచ్చెలివో నను వీడిపోకు
నీతోనె నా చెలిమి చితిచేరువరకు -- ”తొలిచూపులోనే”

Friday, February 4, 2011

అనుకోలేదే

అనుకోలేదే ఈ నిమిషం
ఎదలో మల్లెలు విరియుననీ
కలగనలేదే ఈ విషయం
బ్రతుకున తేనెలు కురుయుననీ - “అనుకోలేదే”

ఎడారిన నదులే పొంగుననీ
ఎండిన మానే చిగురించుననీ
మౌనమే మాటలాడుననీ
మూగవోయిన హ్రుదయవీణ
తిరిగి పాట పాడుననీ - “అనుకోలేదే”

కారుమబ్బులే కరుగుననీ
మంచుపొరలే తొలగుననీ
నుదిటి రాతలే మారుననీ
నడక మరచిన నాట్యమయూరి
తిరిగి ఆటలాడుననీ - “అనుకోలేదే”

శిశిరమే వికసించుననీ
గరళమే బ్రతికించుననీ
కఠినశిలలే కరుణించుననీ
చీకటి కమ్మిన చందమామ
తిరిగి వెన్నెల చిలుకుననీ - “అనుకోలేదే”

Tuesday, February 1, 2011

తెలుగమ్మాయి

సాకీ:
తెలుగుతనం ఉట్టిపడే బుట్ట బొమ్మలా
బాపూబొమ్మ ఉలికిపడే ముద్దుగుమ్మలా
అమరావతి శిల్పంలా అన్నమయ్య కల్పనలా
క్రిష్ణవేణి తరగలా గోదావరి నురగలా

పల్లవి:
ఎవరో ఎవరో నను పిలిచారూ
ఎదలో సుధలే కురిపించారూ
ఎవరో ఎవరో నను తలచారూ
మదిలో గుబులే కలిగించారూ ----- ”ఎవరో”

చరణం 1:
నుదుటిన మెరిసే కుంకుమ తిలకంలా
కనులకు దిద్దిన నల్లని కాటుకలా
అరచేతిన పండిన ఎర్రని గోరింటలా
పాదాలకు రాసిన పచ్చ ని పారాణిలా
కూచిపూడి భంగిమలా
క్షేత్రయ్య భావనలా
కొండపల్లి బొమ్మలా
కోనసీమ కొబ్బరి రెమ్మలా
ముంగిట ముచ్చటగా తీర్చిన
రంగవల్లికలా ----- ” ఎవరో”

చరణం2:
పెరటిలో వెలసిన తులసీ కోటలా
ఇంటిముందు విరిసిన గులాబీ తోటలా
తలలూపుతు పలకరించు పచ్చని పైరులా
గలగల పారుతున్న తెల్లని సెలయేరులా
దీపావళి వెలుగులా
సంక్రాంతి సందడిలా
రామదాసు కీర్తనలా
ఘంటసాల మధుర గాత్రములా
అందరినీ అలరించే స్వాతి
సపరివార పత్రికలా ----- ”ఎవరో”