Thursday, March 3, 2011

అమ్మ

అమ్మా అని పిలిచినా
నీ పలుకే వినపడదే
ఎన్ని రాత్రులేడ్చినా
నీ జాడే కనపడదే
కన్న అమ్మ లేని జన్మ
కలనైనా వలదులే
కనులముందు లేని అమ్మ
కథలాగా మిగిలెనులే //అమ్మా అని//

ఎపుడో చిన్నప్పుడు
నిను చూసిన లేత గురుతులు
కళ్లలో లీలగా
కదిలే తీపి జ్ఞాపకాలు
అందమైన నీ నవ్వూ
చందమామలాంటి మోము
అంత పెద్ద కళ్లూ
ఆ కళ్లనిండ ప్రేమా
జోలపాట పాడావు
లాలి పోసి పెంచావు
కనులుమూసి తెరిచేలోగా
కనుమరుగై పోయావు
ఆ దేవుడికి నువ్వంటే అంత ఇష్టమా
అమ్మలేని బ్రతుకు నాకు ఎంత కష్టమో //అమ్మా అని//


అమ్మా నీవెక్కడ
ఒక్కసారి కనపడవా
నీ ఒడిలో తలవుంచి
నిదురపోనీయవా
నీచేయి అందించిన
గోరుముద్దలేవమ్మా
నా చెంపలు నిమిరిన
అరచేతులు ఏవమ్మా
నాతో మాటాడవా
నీ అక్కున చేర్చుకోవా
గుడిలో దేవత నీవా
బడిలో స్నేహిత నీవా
నువ్వులేని నిజం కల అయినా బాగుండు
కలనైనా నువ్వు కనిపిస్తే బాగుండు //అమ్మా అని//

1 comment: