Sunday, March 20, 2011

నాన్న

నాన్నంటే మాకు ఎంతో గురి
నాన్న మాటంటే మాకు పంచాక్షరి
నాన్న అడుగు జాడలే
మాకు చూపాయి దారి
ఆ దారే నేర్పింది మాకు
ఎలా ఈదాలో జీవన గోదారి //నాన్నంటే//

రేయనకా పగలనకా కష్టపడి
ఇంటిబండి లాగుతాడు నాన్న
ఆలనతో పాలనతో లాలించి
కన్న బిడ్డలను పెంచుతాడు నాన్న
తప్పు చేయవద్దంటూ
బుద్ధిగా వుండమంటు
గద్దించి చెబుతాడు నాన్న
కంటిచూపుతో బెదిరించి
మనసులోనె దాస్తాడు ప్రేమ
పైపైన చూపుతాడు గాంభీర్యం
లోలోన చిలుకుతాడు వెన్నసముద్రం //నాన్నంటే//

వేదాలెంత చదివినా
పురాణాలెన్ని వెతికినా
నీకు కనిపించని మార్గం చూపేది నాన్న
నీ వెన్నుతట్టి ముందుకు నడిపేది నాన్న
నీ వెంటే ఉంటూ
నీ గమనం కంటూ
నీ విజయాన్ని కోరేది నాన్న
నాన్నంటే నీ హితుడు
నాన్నంటే స్నేహితుడు
నాన్నంటే సాక్షాత్తు
ఆ భగవత్‌ స్వరూపుడు //నాన్నంటే//

No comments:

Post a Comment