Wednesday, March 23, 2011

తెలుగు బాల


ఓ తెలుగు బాలా ఇలా చూడవేలా
నీ కట్టూ బొట్టూ నాకు నచ్చిందే చాలా
ఓ అందాల బొమ్మా ఇటు రావేలనమ్మా
నీ నడకా కులుకూ నాకు నచ్చిందే కొమ్మా //ఓ తెలుగు బాలా//

నీ పట్టు ఓణీ చూసీ
మనసే పారేసీ
నీ చుట్టూ తిరిగానమ్మా ఓ అలివేణీ
నీ వాలుజడనే చూసీ
నిదురే మానేసీ
నీ కలలే కన్నానమ్మా ఓ విరిబోణీ
నీ అడుగులు చేసే అలికిడిలో
నీ మువ్వలు చేసే సవ్వడిలో
రాగాలెన్నో విన్నానమ్మా ఓ కలకంఠీ
ఈ జన్మకు నువ్వే చాలమ్మా
నా ప్రాణం నీదే లేవమ్మా
నువు లేని బ్రతుకే వద్దమ్మా
నీ కోసం ఆదేవుడినైనా ఎదిరిస్తానమ్మా //ఓ తెలుగు బాలా//

నీ కందిరీగ నడుమే చూసీ
మదిలో గుబులేసీ
నీ వెనకే నడిచానమ్మా ఓ యువరాణీ
నీ కలువ రేకుల కనులే చూసీ
నన్ను నేనే మరచీ
నీ ధ్యానమే చేశానమ్మా ఓ గజగామీ
నీ చూపులు విసిరిన భాషలలో
నీ జడలో తురిమిన మల్లెలలో
నవ్వులు ఎన్నో చూశానమ్మా ఓ మధువాణీ
నువ్వాదేవుడిచ్చిన వరమమ్మా
నువు పక్కన వుంటే చాలమ్మా
ఇంకేమీ నాకు వద్దమ్మా
నీకోసం ఎన్నాళ్ళైనా వేచి వుంటానమ్మా //ఓ తెలుగు బాలా//

No comments:

Post a Comment